న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. అధిక వడ్డీరేటును అందించే ఈ ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు మార్చి నెలాఖరు వరకు అమలులో ఉంటాయి. ఎస్బీఐతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అమలు చేస్తున్నాయి.
దీర్ఘ కాలిక స్థిరత్వమే ప్రధానంగా ఉండే బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాల్లో భాగంగా సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కానున్నది. వీరికి అదనపు బెనిఫిట్లు కూడా లభిస్తాయి. ఈ పథకం కింద డిపాజిట్ చేసేవారికి ఆయా బ్యాంకులు అందించే వడ్డీరేట్లు విభిన్నంగా ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం..
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్
ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లో నగదు డిపాజిట్ చేసేవారికి 80 బేసిక్ పాయింట్ల (బీపీఎస్) వడ్డీరేటు అందిస్తున్నది. ఇప్పుడు సాధారణంగా అమలు చేస్తున్న ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై 5.4 శాతం వడ్డీరేటు అందుతున్నది. సీనియర్ సిటిజన్లకు 6.2 శాతం వడ్డీరేటు అందిస్తున్నది ఎస్బీఐ.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 6.25 శాతం వడ్డీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు అధికంగా 75 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు అందిస్తున్నది. దీని ద్వారా 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకులో 6.30 శాతం వడ్డీ
సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై అధికంగా ఐసీఐసీఐ బ్యాంకు 80 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లు కల్పిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్ కింద డిపాజిట్ చేసే వారికి 6.30 శాతం వడ్డీరేటు అందిస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా..
సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా అదనంగా 100 బీపీఎస్ వడ్డీరేటు అందజేస్తున్నది. 5-10 ఏండ్ల గడువు గల ఎఫ్డీలకు 6.25 శాతం వడ్డీరేటు అమలవుతుంది.