హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీని ఆధునీకరించడంతోపాటు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దోహదపడే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు.
సాంకేతికతను మెరుగుపర్చేందుకు ద్రవ్యపరమైన మద్దతునిచ్చే మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని సీఐఐ ఆధ్వర్యంలో డిఫెన్స్ మరియు స్పేస్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. మౌలిక సదుపాయాలు, ప్రతిభ, నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో రక్షణ, ఏరోస్పేస్ రంగంలో వృద్ధిని కొనసాగిస్తున్నదని వివరించారు.