న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : దేశీయ ఐటీ రంగ సంస్థలు.. సాఫ్ట్వేర్ నుంచి హార్డ్‌వేర్ వైపునకు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే దాదాపుగా బడా కంపెనీలన్నీ వ్యూహాత్మకంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ ప్రాజెక్టుల దిశగా వెళ్తున్నాయి. తద్వారా భారత్‌లో చిప్స్ తయారీకి పెద్ద ఎత్తున ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి. దీంతో ఇంజినీరింగ్, రిసెర్చ్, డెవలప్మెంట్ కోసం వివిధ సంస్థలతో కలిసి భారీగా పెట్టుబడులకూ ప్రముఖ ఐటీ కంపెనీల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఆయా సంస్థల్లో వాటాలనూ దక్కించుకుంటున్నాయి.
నిజానికి గత కొన్నేండ్ల నుంచే సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోకి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. అయితే ఇటీవలికాలంలో అవి విస్తరణ బాట పట్టడం గమనార్హం. ఇక నిరుడు రూ.1.26 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినదీ విదితమే.
హర్మన్స్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ బిజినెస్‌లో ప్రధాన ఐటీ కంపెనీ విప్రో గత నెల 375 మిలియన్ డాలర్లతో వాటాను దక్కించుకున్నది. ఈ ఏడాది డిసెంబర్ 31కల్లా ఈ డీల్ పూర్తవుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. అలాగే విప్రో, హర్మన్, సామ్‌సంగ్‌ల మధ్య ఓ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా కుదిరిందని చెప్తున్నారు. ఇప్పటికే తమ అనుబంధ సంస్థ విప్రో పారీ ద్వారా భారీ మెషినరీ తయారీ సంస్థలకు విప్రో సేవలందిస్తున్నది. ఈ నేపథ్యంలో విప్రో-హర్మన్స్ లావాదేవీ మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
హెచ్‌సీఎల్ గ్రూప్ నోయిడాలో ఫాక్స్‌కాన్‌తో కలిసి ఓ ఫ్యాబ్‌ను పెడుతున్నది. ఈ ప్రాజెక్టుపై పెట్టుబడులు రూ.3,706 కోట్లుగా ఉన్నాయి. మేలో కేంద్ర క్యాబినెట్ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. 2019, 2020ల్లోనే హెచ్‌సీఎల్ టెక్.. సంకల్ప్ సెమీకండక్టర్‌ను సొంతం చేసుకున్నది. నిరుడు ఇంటెల్ ఫౌండ్రీతో విప్రో, హెచ్‌సీఎల్ టెక్ జట్టుకట్టాయి.
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్ కూడా బెంగళూరుకు చెందిన సెమీకండక్టర్ డిజైన్, ఎంబెడ్డెడ్ కంపెనీ ఇన్సెమీతో గత ఏడాది జట్టు కట్టింది.
సిరియం సిస్టమ్స్‌ను టెక్ మహీంద్రా, ఎగ్జిమస్ డిజైన్‌ను విప్రో హస్తగతం చేసుకున్నాయి. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ తదితర అంతర్జాతీయ సంస్థలూ థర్డ్-పార్టీ ఆర్అండ్డీ సర్వీసులను అందిస్తున్నాయి.
మధ్యశ్రేణి ఐటీ రంగ కంపెనీ సైయెంట్ ఏకంగా సొంతంగానే సైయెంట్ సెమీకండక్టర్స్ పేరిట ఓ సెమీకండక్టర్ సంస్థను తీసుకొచ్చింది. ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, దాని అనుబంధ సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీ ఆధ్వర్యంలో ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్ పరిచయమైంది.
దేశీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థ టీసీఎస్.. ఇటీవలే తమ చిప్సెట్ ఆధారిత సిస్టమ్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించింది. సెమీకండక్టర్ కంపెనీలు సరికొత్త సెమీకండక్టర్లను తయారు చేసేందుకు దోహదం చేసేలా దీన్ని రూపొందించారు. టాటా ఎలక్ట్రానిక్స్ ఇందులో భాగస్వామ్యమై ఉంటుంది. తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్‌తో టాటా ఎలక్ట్రానిక్స్ టై-అప్ అయ్యింది. ఈ క్రమంలోనే గుజరాత్లో కొన్ని చిప్ తయారీ కేంద్రాలను తెచ్చే ఆలోచనలో కూడా టాటా గ్రూప్ ఉన్నది.
ప్రస్తుతం గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్ విలువ దాదాపు 600 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణుల అంచనా. అయితే 2032 నాటికి ఇది 2 ట్రిలియన్ డాలర్లను తాకవచ్చని చెప్తున్నారు.
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీకి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఈ తరుణంలో ఆయా సంస్థలు ఇతర వ్యాపార రంగాల వైపు చూడటం మంచిదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ ఐటీ పరిశ్రమకు దేశీయంగా కంటే విదేశీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటున్నది. అందులోనూ అమెరికా, ఐరోపాల వాటా అధికం. అయితే ఇప్పుడు ఆయా దేశాల్లో పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. దీంతో ఐటీ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకొనే పనిలోపడ్డాయి. కొత్త నియామకాల సంగతి పక్కనపెడితే.. ఉన్న ఉద్యోగులనే భారీగా తీసేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
జెన్ఏఐ అనేది కేవలం ఓ టెక్ సైకిల్ మాత్రమే కాదు. అదో నాగరిక మార్పు. సెమీకండక్టర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, రోబోటిక్స్, ఎనర్జీ ఇన్నోవేషన్లలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే కీలకపాత్ర.
-ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్
హై-పర్ఫార్మెన్స్ సెమీకండక్టర్ సొల్యూషన్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. సైయెంట్ సెమీకండక్టర్స్ ఈ విషయంలో ప్రధాన భూమికను పోషించగలదు. చిప్ తయారీ, పరోశోధనల రంగంలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తాం.