Russia-Ukraine War | ఉక్రెయిన్పై రష్యా జరుగుతున్న యుద్ధం సగటు భారతీయుడిపై గణనీయంగా ప్రభావం చూపనున్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఇప్పటికే ముడి చమురు ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. రోజువారీగా వంటలో వాడే వంట నూనెలు.. సబ్బులు, బిస్కట్ ప్యాకెట్లు తదితర ఉత్పత్తుల ధరలు 20-30 శాతం పెరుగుతాయని పరిశ్రమ, వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రతి వస్తువు ప్లాస్టిక్ ప్యాకేజీతో వినియోగదారుల ముందుకు వస్తున్నది. ముడి చమురు అనుబంధ ఉత్పత్తుల నుంచే ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తారు. కనుక సబ్బులు, వంట నూనెలు, బిస్కట్లు ఒక్కటేమిటి.. అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదలతో సగటు భారతీయుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తున్నది.
సబ్బులు, వంట నూనెలు ఇతర రోజువారీ ఉత్పత్తుల ధరలు ఒకటి, రెండు వారాల్లో 15-20 శాతం పెరుగుతాయని పార్లే ఉత్పత్తుల సీనియర్ క్యాటగిరీ హెడ్ మయాంక్ షా చెప్పారు. సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, పామాయిల్ వంటి వంట నూనెల రవాణా భారం పెరుగుతుంది. వంటనూనెల్ఓ 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. కనుక వీటి ధరలు 18-20 శాతం పెరగనున్నాయి. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో పరిస్థితి దారుణంగా మారుతుందని అఖిల భారత వంటనూనెల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు శంకర్ ఠక్కర్ స్పష్టం చేశారు.
గత ఏడాది కాలంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వివిధ వస్తువుల ప్యాకేజీంగ్ కాస్ట్ 30-35 శాతం, రవాణా వ్యయం 50 శాతం పెరిగింది. వీటితోపాటు వంట నూనెలధరలు సుమారు 50 శాతం ఎక్కువైంది. ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు 100 శాతం పెరిగాయి. గత ఆరు నెలలుగా అన్ని రకాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు దాదాపు 20-30 శాతం పైపైకి దూసుకెళ్లాయి. మారికో ఎండీ కం సీఈవో సౌగతా గుప్తా మాట్లాడుతూ రవాణా, ప్యాకేజింగ్ కాస్ట్ భారం సర్దుబాటు చేసుకున్నా.. వినియోగదారులపై కొంత భారం మోపక తప్పదన్నారు.