Smartphone | న్యూఢిల్లీ, జనవరి 31: స్మార్ట్ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టకముందే మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించినందున స్మార్ట్ఫోన్ల ధరలు 3-5 శాతం మధ్య తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ కవర్, లెన్స్, సిమ్ సాకెట్ తదితర మొబైల్ ఫోన్ తయారీలో వినియోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది.
సెల్యులార్ మొబైల్ తయారీకి ఉపయోగించే అన్ని విడిభాగాలపై దిగుమతి సుంకం 10 శాతానికి పరిమితం చేస్తూ నోటీఫై చేసింది. సుంకాల్లో కోత పెట్టినందున, ఫోన్ల తయారీ సంస్థల వ్యయాలు తగ్గుతాయని, ఈ ప్రయోజనాన్ని త్వరలో వినియోగదారులకు మళ్లిస్తాయని పరిశ్రమ నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఎంట్రీ, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల ధరలు 3 నుంచి 5 శాతం వరకూ తగ్గవచ్చని వెల్లడించారు. దేశంలో మొబైల్ తయారీకి ప్రోత్సాహకంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రధానికి, ఆర్థిక మంత్రికి కేంద్ర టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు.