Small Cap Mutual Funds | ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ అవసరాలు, పిల్లల చదువులు, పెండ్లిండ్ల కోసం పొదుపు చేస్తుంటారు. అటువంటి పొదుపు పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. స్టాక్ మార్కెట్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు రిస్క్ ఉన్నా రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ ఏడాది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై మదుపర్లకు 55 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఉదాహరణకు మీరు ఈ ఏడాది ప్రారంభంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టారనుకుందాం. ఇప్పడది సుమారు రూ.1.50 లక్షలకు చేరుకుంది.
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపుపై 45 శాతానికి పైగా, మల్టీ క్యాప్ ఫండ్స్ మీద 40 శాతానికి పై చిలుకు, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపైన సుమారు 40 శాతం, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో నిధుల మదుపుపై 30 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఓ లుక్కేద్దాం.. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 16 శాతానికి పైగా గ్రోత్ నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్ 61 వేల పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభిస్తే.. ఇప్పుడు 71,106 పాయింట్ల వద్ద ముగిసింది. ఏడాది కాలంలో సెన్సెక్స్ 10 వేల పాయింట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ గ్రోత్ తో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అధిక రిటర్న్స్ ఇస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్ వైవిధ్యభరితమైన మ్యూచువల్ ఫండ్స్.. స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ పేరుతో ఏర్పాటు చేసే ‘ప్యాకేజీ’ ఫండ్స్. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో మనం పెట్టే పెట్టుబడులను ఫండ్ మేనేజర్.. 25 శాతం స్మాల్ క్యాప్, మరో 25 శాతం మిడ్ క్యాప్, 25 శాతం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా 25 శాతం పెట్టుబడులను ఫండ్ మేనేజర్ తన వెసులుబాటును బట్టి ఆయా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు.
కంపెనీల వారీగా సింగిల్ ఫండ్ లోనూ పెట్టుబడి పెట్టొచ్చు. ఫ్లెక్సీ ఫండ్స్‌లో మదుపర్ల పెట్టుబడులను వారి చాయిస్‌ను బట్టి స్మాల్ లేదా మిడ్ లేదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు.
దేశంలోని కంపెనీలను మూడు రకాలుగా విభజించారు. రూ.5000 కోట్ల లోపు మార్కెట్ క్యాపిటలైజేషన్ గల కంపెనీలను స్మాల్ క్యాప్, రూ.5000-20 వేల కోట్ల మధ్య ఎం-క్యాప్ గల సంస్థలను మిడ్ క్యాప్ కంపెనీలు అని పరిగణిస్తారు. రూ.20 వేల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థలను లార్జ్ క్యాప్ సంస్థలు అని చెబుతారు. దేశంలోని మొత్తం కంపెనీల్లో టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్, 100-250 కంపెనీలు మిడ్ క్యాప్ కంపెనీలుగా, మిగతా కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలుగా పరిగణిస్తారు.