Car Sales | బుల్లికార్లకు 20 ఏండ్ల క్రితంతో పోలిస్తే డిమాండ్ పడిపోతున్నది. గతంలో భార్యాభర్తలు.. ఇద్దరు పిల్లలు వెళ్లడానికి వీలుగా బుల్లి కార్లు కొనే వారు.. ఇప్పుడు అన్ని వసతులు.. మెరుగైన డ్రైవింగ్ ఫెసిలిటీ గల
యుటిలిటీ వెహికల్స్ (యూవీ), స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు గిరాకీ పెరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద టైర్లతో సుఖవంతంగా సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ఎస్యూవీ.. యూవీ కార్లతో మంచి వెసులుబాటు ఉంటుంది. క్రిసిల్ అధ్యయనం ప్రకారం గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో యుటిలిటీ, ఎస్యూవీ మోడళ్ల సేల్స్ 48 శాతం పెరిగాయి. 2002లో ఇవి కేవలం 15 శాతం మాత్రమే ఉండేవి. గత 20 ఏండ్లలో యుటిలిటీ వెహికల్స్ సేల్స్ 33 శాతం పెరిగాయి. 2021-26 మధ్య ఇతర సెగ్మెంట్ కార్ల కంటే యుటిలిటీ, ఎస్యూవీ వేరియంట్ కార్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని క్రిసిల్ విశ్వసిస్తున్నది.
యుటిలిటీ కార్ల సేల్స్‌లో 18 శాతం గ్రోత్
గత ఆర్థిక సంవత్సరం యుటిలిటీ కార్లు 39 శాతం అమ్ముడైతే, ఈ ఏడాది 14-18 శాతం పెరిగాయి. 2026 కల్లా పెద్ద యుటిలిటీ కార్ల సేల్స్ 51-53 శాతం పెరుగుతాయని క్రిసిల్ అంచనా వేస్తున్నది. బ్రెజా, క్రెటా, ఎర్టిగా, నెక్సాన్, ఎస్యూవీ 300, సెల్టోస్, వెన్యూ, సొనెట్, మాగ్నైట్, క్యాగర్ వంటి ఎస్యూవీ కార్ల సేల్స్ 70-80 నమోదయ్యాయి. ఇదే టైంలో బుల్లి కార్ల సేల్స్‌లో కేవలం 4-6 % గ్రోత్ మాత్రమే నమోదైంది. భారత్‌లో బుల్లి కార్ల మార్కెట్‌ను ఇతర సెగ్మెంట్లు అధిగమించేస్తున్నాయి. 2012లో బుల్లి కార్ల విక్రయాలు 65 శాతంగా ఉన్నాయి.
ఏటేటా పెరుగుతున్న యూవీ గిరాకీ
2009-19 మధ్య బుల్లి కార్ల విక్రయాలు ఏడు శాతం ఉంటే, యుటిలిటీ సెగ్మెంట్స్‌లో ఏడాదికేడాది 16 శాతం సేల్స్ పెరుగుతున్నాయి. కార్ల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడల్ కార్లు తయారు చేస్తున్నాయి. 2002లో ఆరు కంపెనీలు 11 రకాల యూవీ కార్లను తీసుకొస్తే 2020లో ఆయా కార్ల తయారీ సంస్థలు ఆవిష్కరించిన కొత్త మోడల్ కార్లు 68కి పెరిగాయి.