హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : దేశంలో మొదటిసారిగా కార్బన్డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీకి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంటును మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ విద్యుత్తు ప్లాంటులో ఏర్పాటు చేస్తున్నది. థర్మల్ ప్లాంట్‌లో బొగ్గును మండించడం ద్వారా వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌ను హైడ్రోజన్ వాయువుతో మిలితం చేసి చివరగా మిథనాల్‌ను తయారుచేయనున్నారు. రోజుకు 500 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ను మిథనాల్‌గా మార్చే ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం తుది దశకు చేరుకున్నదని, డిసెంబర్ 31 నాటికి ఈ ప్లాంట్ పూర్తకాగలదని సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు. ఈ ప్లాంట్‌లో 99.9 శాతం కర్బన ఉద్ఘారాలను మిథనాల్‌గా మార్చేందుకు ఎలక్ట్రో స్ట్రాటిక్ ప్రెసిపిటేటర్స్ (ఈఎస్పీ)ని నెలకొల్పామన్నారు. కోలిండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ సీఎం పీడీఐఎల్ సహకారంతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని, ఇందుకోసం రూ. 20 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు, రోజుకు 180 కేజీబీల మిథనాల్‌ను తయారుచేస్తామన్నారు. ఈ మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్, ప్లాస్టిక్, సింథటిక్, పైబర్ వస్ర్తాలు, ఫ్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారని తెలిపారు.