Singareni | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్‌లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్‌శర్మ, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ గుప్తా, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్‌లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీనిలో భాగంగా రాజస్థాన్ విద్యుత్తుశాఖ అనుబంధ సంస్థతో సింగరేణి జాయింట్ వెంచర్ విధానం కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్ట్‌లను నెలకొల్పుతారు. మొత్తం లాభాల్లో 74% సింగరేణి, 26% రాజస్థాన్ విద్యుత్తు ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌కు వాటాగా నిర్ణయించారు.