హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభంతో సింగరేణి వ్యాపార విస్తరణలో తొలి అడుగు విజయవంతమయ్యిందని కంపెనీ సీఎండీ ఎన్ బలరామ్ అభిప్రాయపడ్డారు. నైనీ స్ఫూర్తితో ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఖనిజాల ఉత్పత్తికి తాము సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నైనీ బొగ్గు బ్లాక్‌ను ప్రారంభించిన సందర్భంగా పలువురు అధికారులు, కార్మిక సంఘాల నేతలు శనివారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్లో సీఎండీని అభినందించి, ఘనంగా సన్మానించారు. నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి కోసం తొమ్మిదేండ్లుగా రిటైర్డ్, ప్రస్తుత సింగరేణి అధికారులు కృషిచేశారని ఈ సందర్భంగా సీఎండీ గుర్తుచేశారు.
బొగ్గు ఉత్పత్తితో పాటు, ఇతర ఖనిజాల ఉత్పత్తి సంస్థగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్టు, దీంట్లోభాగంగా థర్మల్, పునరుత్పాదక విద్యుత్తు రంగంలోను అడుగు పెట్టడానికి ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు చెప్పారు. మరోవైపు, సింగరేణి ప్రాంతంలోని కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్‌తో కూడిన విద్యనందించాలన్న బలరామ్ చొరవ ఫలించింది. రామగుండం -2 ఏరియాలోని సింగరేణి సెక్టర్ -3 పాఠశాలకు సీబీఎస్ఈ అనుమతి లభించింది. డిసెంబర్లో సీబీఎస్ఈకి ప్రతిపాదనలు పంపించగా, సీబీఎస్ఈ బృందం తనిఖీ చేసి, తాజాగా శనివారం సీబీఎస్ఈ అనుమతినిచ్చింది. ఈ పాఠశాలలో 1 -8 తరగతులను నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో సీబీఎస్ఈ పాఠశాలను నెలకొల్పనున్నట్లు బలరామ్ తెలిపారు.