హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఐటీ తరహాలో ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ రంగంలోనూ హైదరాబాద్‌ను దేశానికి ఆదర్శంగా నిలపాలన్న కేటీఆర్ సంకల్పం ఫలిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్నది. ఇప్పటికే డ్రోన్లు, క్షిపణులు, విమాన విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ తాజాగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫ్లైట్ సిమ్యులేటర్ల ఆవిష్కరణకు వేదికగా మారింది.
ప్రభుత్వ ఆధీనంలోని టీ-వర్స్ వేదికగా యుద్ధ విమానాల ఫె్లైట్ సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటున్నది. ఎయిర్‌ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే లెవెల్-డి ఫుల్ ఫె్లైట్ సిమ్యులేటర్లను ఇప్పటి దాకా భారీ వ్యయంతో అమెరికా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటుండగా, ఇకపై ఆ అవసరం ఉండకపోగా మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం మన సొంతమైంది.
యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సిమ్యులేటర్ల తయారీకి అన్ని అనుమతులు సాధించి వాణిజ్య ఉత్పత్తి మొదలు పెట్టింది. వచ్చే మూడేళ్లలో ఐదు సిమ్యులేటర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్(ఐడెక్స్)తో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం మన ఎయిర్‌ఫోర్స్ దిగుమతి చేసుకుంటున్న ఒకో ఫైటర్ జెట్ సిమ్యులేటర్ వ్యయం రూ. 50 కోట్ల దాకా ఉండగా, యాక్సియల్ ఏరో రూ.25-30 కోట్లకే అందజేస్తుంది. టీ-వర్స్‌లో పరిశోధనలు సాగిస్తున్న ఈ సంస్థ ఎయిర్‌ఫోర్స్, నేవీ అవసరాలకు తగిన విధంగా ఫె్లైట్ సిమ్యులేటర్లను తయారు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది.
ఈ సిమ్యులేటర్లు దిగుమతి చేసుకునే వాటికంటే అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉంటాయి. దిగుమతి చేసుకునేవి దిగువన పీఠం నుంచి అన్ని వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే వంగడం, లేవడం చేయగలుగుతాయి. యాక్సియల్ ఏరో రూపొందిస్తున్న సిమ్యులేటర్లు 360 డిగ్రీల మేర తిరగగలిగే స్టివార్టు ప్లాట్ ఫామ్‌ను కలిగి ఉంటాయి.
దీనివల్ల యుద్ధ క్షేత్రంలో శత్రువుకు దొరకకుండా తప్పించుకునేందుకు ఫైటర్ జెట్లను నడిపించే పైలట్లు అనుసరించే విన్యాసాలన్నీ ఇందులో సాధ్యమవుతాయి. సిమ్యులేటర్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైతే విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలు పుట్టుకొస్తాయి. ఎంఎస్ఎంఈ రంగం కూడా ప్రయోజనం పొందుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఫె్లైట్ సిమ్యులేటర్ల ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-వర్క్స్ పేరుతో దేశంలోనే అదిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో దీనికి అంకురార్పణ చేశారు. అది ఇప్పుడు హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ పైసా ఖర్చులేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనలతో ఉత్పత్తులను ఆవిష్కరించుకునే అవకాశం కల్పిస్తున్నారు. 2016లో కేటీఆర్ చేతుల మీదుగా బేగంపేటలో ప్రారంభమైన ఈ కేంద్రం అనంతరం రాయదుర్గంలోని సొంత భవనానికి మారింది.
4.92 ఎకరాల స్థలంలో రూ. 350 కోట్లతో 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని అప్పటి బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది. 2023 మార్చి 2న అప్పటి మంత్రి కేటీఆర్ ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ యంత్ర తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వర్క్ స్టేషన్లు, ఫినిష్ షాప్‌లు, లేజర్ కటింగ్, పీసీబీ ఫ్యాబ్రికేషన్, మెటల్ షాప్, వెల్డ్షాప్, వుడ్ వర్కింగ్ వంటి అనేక వసతులు ఇందులో ఏర్పాటుచేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు దశల్లో రూ. 100 కోట్ల విలువచేసే యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేసింది.
ఇటీవల టీ-వర్స్ను సందర్శించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దాదాపు రెండు గంటలపాటు పరిశోధనల పురోగతిని పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. క్లిష్టమైన పరిశోధనలను పూర్తిచేసి ఆర్డర్లు సాధించినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారు. త్వరలో అత్యాధునిక సిమ్యులేటర్లను రూపొందించి విశ్వనగరం హైదరాబాద్ కీర్తిని జెట్‌వేగంతో గగనతలానికి తీసుకెళ్లాలని సూచించారు.
ఫ్లైట్ సిమ్యులేటర్ అంటే?
వాయుసేనలో పైలట్లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదట ఫె్లైట్ సిమ్యులేటర్లలో శిక్షణ ఇస్తారు. విమానం ఎగురుతున్నట్టు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు నిజంగానే ఎయిర్ క్రాఫ్ట్‌ను గాలిలో నడిపిన అనుభూతిని, అనుభవాన్ని ఇస్తాయి. కాక్‌పిట్‌లో కూర్చొని బయటి నుంచి శిక్షకులు ఇచ్చే సూచనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్, తలకిందులుగా ఎగరడం లాంటి అన్ని రకాల విన్యాసాల శిక్షణ సిమ్యులేటర్ ద్వారా లభిస్తుంది. యుద్ధ విమానాల్లో ఉండే ఎలక్ట్రానిక్, ఆటోమేటిక్ నియంత్రణ వ్యవస్థలన్నీ ఇందులో ఉంటాయి. ఎదురుగా అర్ధచంద్రాకారంలో ఉండే స్రీన్‌పై ఫైటర్ జెట్ కదులుతున్న దృశ్యాలు కనిపిస్తాయి.