న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : వరుసగా పెరుగుతూపోయిన వెండి ధరలకు బ్రేక్ పడింది. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.460 పడిపోయి రూ.1,80,900 పలికింది. అంతకుముందు 6 రోజులు సిల్వర్ వాల్యూ క్రమంగా పెరుగుతూపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆల్‌టైమ్ హై రికార్డును అధిగమిస్తుందా? అన్న ఊపు కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కిలో ధర మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,85,000గా నమోదైన సంగతి విదితమే. కాగా, వరుసగా 6 ట్రేడింగ్ సెషన్లలో వెండి ధర రూ.26,360 పుంజుకోవడం విశేషం. ఇదిలావుంటే బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.670 అందుకుని రూ.1,32,200కు చేరింది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. మంగళవారం రూ.1,670 తగ్గినది తెలిసిందే. అయితే అక్టోబర్‌లో తులం రూ.1,34,800గా నమోదై ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పింది విదితమే. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, దేశీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రికార్డు పతనాల మధ్య మదుపరులు తమ పెట్టుబడులకు సురక్షిత సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారని బులియన్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.710 ఎగిసి రూ.1,30,580కి చేరింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రేటు రూ.650 ఎగబాకి రూ.1,19,700గా నమోదైంది. కాగా, అటు బంగారం, ఇటు వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో మార్కెట్లో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్వంటి పండుగలు, సెలబ్రేషన్లు రాబోయే రోజుల్లో ఉండటంతో ధరల తీరు ఇలాగే ఉంటే వ్యాపారం సాగేదెలా? అన్న బెంగ పెట్టుకుంటున్నారు. మరోవైపు దేశీయ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అధిక ముడి చమురు ధరలు కూడా ఇన్వెస్టర్లను గోల్డ్, సిల్వర్ వైపు చూసేలా చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,230.67 డాలర్లు, వెండి 58.40 డాలర్లుగా వుంది.