న్యూఢిల్లీ, జూలై 14 : వెండి మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు ఎగబాకింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రికార్డు స్థాయి రూ.1.15 లక్షలకు చేరుకున్నది. దీంతో వరుసగా రెండు రోజుల్లోనే వెండి రూ.10 వేలకు వరకు పెరిగినట్టు అయింది. ఇటు హైదరాబాద్లో కిలో వెండి రూ.1.25 లక్షలు పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1.71 శాతం ఎగబాకి 39.02 డాలర్లు పలికింది. అలాగే ఔన్స్ గోల్డ్ ధర మాత్రం 3,371.14 డాలర్ల వద్ద నిలకడగా ఉన్నది. కాగా, వెండితోపాటు బంగారం కూడా మరింత ప్రియమైంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.200 ఎగబాకి రూ.99,570కి చేరుకున్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా అంతే స్థాయిలో పెరిగి రూ.99 వేలు పలికింది. హైదరాబాద్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.170 అధికమై రూ.99,880కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.150 పెరిగి రూ.91,550కి చేరుకున్నది.