Gold-Silver Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బంగారం స్వల్పంగా.. పెరగ్గా వెండి మాత్రం భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అమెరికా సుంకాల అనిశ్చితి మధ్య డాలర్ బలహీనపడింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు లోహాలపై ఆసక్తి చూపడంతో డిమాండ్ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వెండి ధర రూ.5వేలు పెరిగి కిలోకు రూ.1.15లక్షలకు చేరుకుంది. శనివారం కిలోకు రూ.4500 పెరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి తులానికి రూ.99,570కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.200 పెరగడంతో రూ.99వేల మార్క్‌ను అందుకుంది. ఇల్ ఇండియా సరాఫా అసోసియేసన్ ధ్రువీకరించింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ఫ్యూచర్స్ రూ.2,135 పెరిగి కిలోకు రూ.1,15,136 రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఇంతలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టులో అత్యధికంగా ట్రేడ్ అయ్యే బంగారం కాంట్రాక్ట్ డెలివరీ ధర 10 గ్రాములకు రూ.518 పెరిగి రూ.98,336కి చేరింది. వెండి 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి దాదాపు 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. బంగారం ప్రత్యామ్నాయంపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతుండడంతో వల్లే భారీగా పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ సుంకాల ఉద్రిక్తతలు మళ్లీ మొదలవడంతో బంగారం ధరలు సానుకూల ధోరణిని చూస్తున్నాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, పరిశోధన విశ్లేషకుడు జతిన్ త్రివేది పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికో వంటి వాణిజ్య భాగస్వాములపై అమెరికా అదనపు సుంకాలు విధించడం, డాలర్ ఇండెక్స్‌లో బలహీనపడడం కారణంగా బంగారంపై పెట్టుబడులు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్ 1.71శాతం పెరిగి ఔన్స్‌కు 39.02 డాల్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 3,371.14 డాలర్లకు చేరుకుంది. జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని ఈబీజీ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ మాట్లాడుతూ బంగారం మళ్లీ ఊపందుకుందని.. త్వరలోనే ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోబోతున్నాయని అన్నారు. పెరుగుతున్న టారిఫ్ అనిశ్చితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఈటీఎఫ్ పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకుల నుంచి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో బంగారానికి కలిసి వస్తుందన్నారు. ఈ వారంలో యూఎస్ మార్కెట్లో పాల్గొనే వారంతా యూఎస్, యూకే సహా యూరప్ ప్రాంతంతో సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు చెందిన ద్రవ్యోల్బణం డేటా, రిటైల్ అమ్మకాలు, వినియోగదారులు మనోభావాలను నిశితంగా పరిశీలించనున్నారని.. ఇది బులియన్ ధరలకు దిశా నిర్దేశం చేస్తుందని వివరించారు.