Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు రూ.8వేలు పెరిగి.. తొలిసారిగా వెండి కిలో ధర రూ.1.71లక్షలు దాటింది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్, తీవ్రమైన సరఫరా పరిమితుల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శుక్రవారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకే రోజు రూ.8500 పెరిగి కిలోకు రూ.1,71,500 వద్ద కొత్త రికార్డు స్థాయిని చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. గురువారం కిలో వెండి ధర రూ.1.63లక్షలు పలికింది. గత వరుస మూడు సెషన్లలో వెండి ధర ఏకంగా రూ.17,500 పెరిగింది. మరో వైపు బంగారం ధరలు రికార్డు స్థాయి గరిష్టాల నుంచి దిగజారాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి తులం రూ.1,26,600 పలుకుతుంది.
ఇక 22 క్యారెట్ల పసిడి సైతం రూ.600 తగ్గి తులం రూ.1.26లక్షలకు తగ్గింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో పరిశోధన విశ్లేషకుడు దిలీప్ పర్మార్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, సెంట్రల్ బ్యాంకులు భద్రత, కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం బులియన్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయన్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో విశ్లేషకుడు మానవ్ మోదీ మాట్లాడుతూ వెండి ధర బాగా పెరిగిందన్నారు. డిమాండ్ పెరుగుతున్నప్పటికీ సరఫరాలో ఇది గణనీయమైన కొరతను సూచిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్సుకు 16.61 డాలర్లు పెరిగి.. 3,992.80 డాలర్లకు చేరాయి. స్పాట్ వెండి ఔన్సుకు 1.52 శాతం పెరిగి 50.01 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా వెండి గురువారం ఔన్సుకు డాలర్ల 51 మార్కును దాటింది.