న్యూఢిల్లీ, జనవరి 20: బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. మంగళవారం ఆల్‌టైమ్ హై రికార్డులను నెలకొల్పాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ఈ ఒక్కరోజే రూ.5,100 ఎగబాకి రూ.1.5 లక్షల మార్కును దాటి తొలిసారి రూ.1,53,200 పలికింది. ఇక కిలో వెండి రేటు ఏకంగా రూ.20,400 ఎగిసి మొదటిసారి రూ.3,23, 000గా నమోదైనట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
గ్లోబల్ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పరుగులు పెడుతున్నాయి. ఔన్స్ గోల్డ్ 4,750.49 డాలర్లు పలికింది. ఒక్కరోజే 79.47 డాలర్లు పెరిగింది. ఔన్స్ సిల్వర్ 95.88 డాలర్లుగా ఉన్నది. కాగా, అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. యూరోపియన్ యూనియన్‌పై 10 శాతం సుంకాలు వేస్తామంటూ చేసిన ప్రకటన.. ప్రధానంగా ఇన్వెస్టర్లను ఈక్విటీల నుంచి బంగారం, వెండి వైపునకు వెళ్లేలా చేసిందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఫ్యూచర్ మార్కెట్లో..
ఎంసీఎక్స్‌పై గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి డెలివరికిగాను రూ.6,861 పెరిగి తులం రూ.1,52,500 పలికింది. వెండి రూ.17,723 అందుకుని కిలో రూ.3,27,998గా నమోదైంది. అంతర్జాతీయంగా కొమెక్స్లోనూ ఫిబ్రవరికి గోల్డ్ ఔన్స్ 4,742.9 డాలర్లుగా ట్రేడ్ అయింది. సిల్వర్ ఔన్స్ 95.41 డాలర్లు పలికింది.