న్యూఢిల్లీ, జూలై 1 : ఔషధ రంగ సంస్థ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోగల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఫార్మా రసాయన ఉత్పాదక కేంద్రంలో సోమవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్లోని రియాక్టర్ పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోతూ ఉన్నది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో 5.57 శాతం క్షీణించి రూ.46.07 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 8.36 శాతం దిగజారి రూ.44.71 వద్దకు చేరడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లోనూ 5.76 శాతం పతనమై రూ.45.95 వద్ద నిలిచింది. సోమవారం కూడా బీఎస్ఈలో 11.58 శాతం, ఎన్ఎస్ఈలో 11.19 శాతం నష్టపోయినది తెలిసిందే. ఇంట్రా-డేలోనైతే కంపెనీ షేర్లు గరిష్ఠంగా 14.82 శాతం పతనాన్ని చవిచూశాయి.
ఓ ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదం కారణంగా ఈ స్థాయిలో చనిపోవడం తెలంగాణలోనేగాక, ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ ఇదే తొలిసారి అంటున్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ప్లాంట్ కార్యకలాపాలను పునరుద్ధరించాలంటే దాదాపు 90 రోజులు పడుతుందని యాజమాన్యం చెప్తుండటం.. ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నది. కాగా, పేలుడు కారణంగా ధ్వంసమైన పరికరాలు, నిర్మాణాలను పునర్నిర్మించాలంటే సమయం పట్టనున్నది. అప్పటిదాకా ఇక్కడ ఉత్పత్తి ఆగిపోయినట్టే. ఇక విచారణలు, బాధ్యులపై చర్యలు ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టర్లను పెట్టుబడుల ఉపసంహరణకు ఉసిగొల్పుతున్నాయని మార్కెట్ వర్గాలు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇంటర్మీడియెట్స్, ఎక్సీపియెంట్స్, విటమిన్-మినరల్ బ్లెండ్స్ తయారీతోపాటు ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) సర్వీసులను సిగాచి ఇండస్ట్రీస్ అందిస్తున్నది. మరోవైపు నష్టాల నుంచి కోలుకుని బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు పెరిగి 83,697. 29 వద్దకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24.75 పాయింట్లు అందుకుని 25,541.80 వద్దకు చేరాయి.