నోయిడా, నవంబర్ 1: దేశీయ మార్కెట్లో స్లీప్‌వెల్, కర్లాన్ తదితర ప్రముఖ బ్రాండ్లతో పరుపుల్ని విక్రయిస్తున్న షీలా ఫోమ్ లిమిటెడ్ లాభాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.43 కోట్ల నికర లాభాన్ని సంస్థ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే త్రైమాసికంతో పోల్చితే సుమారు 12 శాతం పెరిగింది.
స్టాండలోన్ రెవిన్యూ రూ.602 కోట్లుగా ఉన్నది. మునుపటితో చూస్తే దాదాపు 42 శాతం ఎగబాకడం గమనార్హం. అలాగే ఏకీకృత ఆదాయం రూ.813 కోట్లుగా నమోదైంది. గతంతో చూస్తే సుమారు 32 శాతం ఎగిసింది. కాగా, ఈసారి స్లీప్‌వెల్ ఉత్పత్తులకు డిమాండ్ 40 శాతం, కర్లాన్ గిరాకీ 26 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. ఆటోమోటివ్, ఫుట్‌వేర్ తదితర మార్కెట్ల నుంచి కూడా డిమాండ్ పెరిగిందని ఈ సందర్భంగా షీలా ఫోమ్ వివరించింది.