ముంబై, జూలై 17 : దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో పాటు బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు దౌడ్తీయడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 964.58 పాయింట్లు లేదా 1.25 శాతం ఎగబాకి 78,151.45 వద్ద నిలిచింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 261.55 పాయింట్లు లేదా 1.09 శాతం బలపడి 24,334.30 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు మదుపర్లలో ఉత్సాహాన్నినింపిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతో పోలిస్తే దేశీయ మదుపర్లు భారీగా నిధులు కుమ్మరించడం సూచీల ర్యాలీకి కలిసొచ్చిందన్నారు. మొత్తంమీద ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు, నిఫ్టీ 127.4 పాయింట్లు బలపోతేం అయ్యాయి. నేటి సూచీల్లో టెక్ మహీంద్రా అత్యధికంగా 3.91 శాతం ఎగబాకగా, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రంగాలవారీగా బ్యాంకెక్స్, ఐటీ, ఫోకస్డ్ ఐటీ, ఆర్థిక సేవల రంగ షేర్లు నష్టపోగా..కమోడిటీస్, ఇండస్ట్రియల్స్, టెలికాం, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంధన ధరలు భారీగా తగ్గడం కూడా సూచీలకు కిక్కునిచ్చింది. కార్పొరేట్ల ఆశాజనక ఆర్థిక ఫలితాలు, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లు కూడా లాభాల్లో ముగియడం కూడా కలిసొచ్చింది.