ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. చివరి గంటలో వెల్లువెత్తిన అమ్మకాలతో ఒక్కసారిగా దేశీయ స్టాక్ మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు నష్టాల్లోకి జారుకున్నది. వచ్చేవారంలో ప్రకటించనున్న ఆర్బీఐ పరపతి సమీక్షలో మరోసారి వడ్డీరేట్లను పెంచనున్నదన్న ఆందోళన మదుపరుల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు మధ్యాహ్నాం తర్వాత ప్రారంభమైన యూరప్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు పతనానికి ఆజ్యంపోశాయి. రూపాయికి మరిన్ని చిల్లులు పడటం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం కూడా ఆందోళన పెంచింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 48.88 పాయింట్లు కోల్పోయి 55,769.23 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 43.70 పాయింట్లు తగ్గి 16,584.30 వద్ద స్థిరపడింది.
వ్యాపార విస్తరణకోసం 12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రకటన మదుపరులకు రుచించలేదు. కంపెనీ షేరు ధర 5.49 శాతం మేర పడిపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు మారుతి, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రాలు నష్టపోయాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. వరుసగా రెండోరోజు కంపెనీ షేరు ధర 2 శాతం అధికమైంది. వీటితోపాటు ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, సన్ ఫార్మా, టీసీఎస్, విప్రో, హెచ్‌యూఎల్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.