ముంబై, సెప్టెంబర్ 28: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు ముగింపు రోజైన గురువారం పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బీఎస్ఈ సెన్సెక్స్ 610 పాయింట్లు క్షీణించి 65,508 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 19,523 పాయింట్ల వద్ద నిలిచింది. ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు, గరిష్ఠ క్రూడ్ ధరలు, అమెరికా గవర్నమెంట్ షట్‌డవున్, చైనా రియల్టీ మార్కెట్ దెబ్బ తదితర అంశాలతో గత 8 రోజుల్లో సెన్సెక్స్ భారీగా 2,417 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్ల చొప్పున పడిపోయాయి. దీంతో మదుపరులు రూ.2.95 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
ఫెడ్ వడ్డీ రేట్లు: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల బాట ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో జరిగిన ఫెడ్ సమీక్షలో అధికశాతం కమిటీ సభ్యులు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గరిష్ఠవడ్డీ రేట్లను దీర్ఘకాలంపాటు కొనసాగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం చివర్లో ఒకసారి, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మరోదఫా రేట్ల పెంపును, అటుతర్వాత రెండు తగ్గింపులు ఉండవచ్చని ఫెడ్ కమిటీ సభ్యులు సంకేతాలిచ్చారు. దీంతో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ సమీక్షలో ఒకదఫా రేట్లను పెంచిన తర్వాత వచ్చే ఏడాది నాలుగుసార్లు రేట్లను ఫెడ్ తగ్గిస్తుందన్న మార్కెట్ అంచనాలకు పెద్ద షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో భారత్‌తో సహా అన్ని దేశాల మార్కెట్లు క్షీణబాట పట్టాయి.
యూఎస్ బాండ్ ఈల్డ్స్: ఫెడ్ తాజా సంకేతాలతో యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 15 ఏండ్ల గరిష్ఠానికి చేరిపోయాయి. రెండేండ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 5.20 శాతానికి పెరిగింది. ప్రపంచంలో సురక్షిత పెట్టుబడుల్లో ఒకటిగా భావించే యూఎస్ ట్రెజరీ బాండ్లలోనే మెరుగైన రాబడి లభించే అవకాశం ఉండటంతో రిస్క్‌తో కూడిన స్టాక్ మార్కెట్ నుంచి నిధులు తరలడం పతనానికి మరో కారణం.
అమెరికా డాలర్ ఇండెక్స్: గరిష్ఠ వడ్డీ రేట్లు కొనసాగనున్న కారణంగా పలు దేశాల నుంచి డాలర్ నిధులు తరలివస్తుండటంతో అమెరికా కరెన్సీ బలోపేతం అవుతున్నది. ఆరు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలర్ ఇండెక్స్ 10 నెలల గరిష్ఠస్థాయి 106.4 వద్దకు చేరడం షేర్లలో అమ్మకాల్ని వేగవంతం చేసింది.
యూఎస్ షట్‌డవున్: అమెరికా ప్రభుత్వ వ్యయాలు కోసం అక్కడి రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయి. నవంబర్ నెలలో వ్యయాల కోసం ఈ శనివారం అర్థరాత్రికల్లా కాంగ్రెస్ ఆమోదం లభించకపోతే ఆదివారం నుంచి యూఎస్ ప్రభుత్వం షట్‌డవున్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఫెడ్ రేట్లతో పాటు ఈ అంశమూ అమెరికా స్టాక్ సూచీలు వరుస పతనానికి కారణం. యూఎస్ మార్కెట్ల సెగ అన్ని దేశాలకూ వ్యాపించింది.
క్రూడ్ ధరల ర్యాలీ: బంగారం, వెండి, ఇతర పారిశ్రామిక లోహాల ధరలు క్షీణిస్తున్నప్పటికీ, ముడి చమురు ధర మాత్రం ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో దూసుకుపోతున్నది. గురువారం ఒకదశలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 97 డాలర్ల స్థాయిని అందుకుంది. భారత్ క్రూడ్ దిగుమతులపై ఆధారపడే దేశమైనందున, ఇక్కడి ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతున్నది.
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు: ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ ట్రెండ్ నెలకొన్న సమయంలోనే భారత స్టాక్ ఎక్సేంజీల్లో సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపునకు వచ్చాయి. రెండు వారాల క్రితం నిఫ్టీ సూచి 20,000 పాయింట్లను దాటి కొత్త రికార్డును సృష్టించడంతో ఇన్వెస్టర్లు క్రియేట్ చేసుకున్న లాంగ్ పొజిషన్లను ఒక్కసారిగా ఆఫ్‌లోడ్ చేయడంతో గురువారం చివరిగంటలో మార్కెట్ నిలువునా పతనమయ్యింది.
విదేశీయుల అమ్మకాలు: యూఎస్ పెడ్ షాక్‌తో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అదేపనిగా అమ్మకాలు జరుపుతున్నారు. గురువారం భారీగా రూ.3,364 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.25,006 కోట్ల నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.
గత 8 ట్రేడింగ్ రోజుల్లో 7 సెషన్లలో నష్టాల్ని చవిచూసిన మార్కెట్ ట్రెండ్ మరికొద్ది రోజులపాటు బలహీనంగానే ఉంటుందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న 20,222 పాయింట్ల రికార్డు గరిష్ఠస్థాయిని తాకినప్పటి నుంచి నిఫ్టీ ఇండె క్స్ ఇప్పటివరకూ 700 పాయింట్లు (3.5 శాతం) క్షీణించింది. అంతక్రితం జరిగిన భారీ ర్యాలీతో పోలిస్తే ఇది పెద్ద పతనంకానప్పటికీ, అధిక వడ్డీ రేట్లు, క్రూడ్ ధరలు కార్పొరేట్ల లాభాల్ని కుదించివేస్తాయని, ఫలితంగా వచ్చే కొద్ది వారాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని ఫండమెంటల్ అనలిస్టులు చెపుతుండగా, పలు తాత్కాలిక మద్దతుస్థాయిల్ని కోల్పోయినందున, సమీప భవిష్యత్తులో నిఫ్టీ మరింత తగ్గవచ్చని టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. గురువారంనాటి పతనంలో కీలకమైన 19,560 స్వల్పకాలక మద్దతు కోల్పో యి, డెయిలీ చార్టుల్లో లాంగ్ బేర్ క్యాండిల్ ఏర్పడిందని, దీంతో తదుపరి మద్దతుస్థాయి 19,230 వరకూ తగ్గవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నాగరాజ్ షెట్టి తెలిపారు. 19,700 స్థాయి అవరోధం కల్గిస్తుందన్నారు. నిఫ్టీ 19,750పైన నిలదొక్కుకోలేకపోతే గణనీయమైన కరెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అంచనా వేశారు.
అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, అధిక విలువలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో తదుపరి ట్రెండ్ ఎలా ఉంటుందో తెలియక బుల్స్ బిక్కచూపులు చూస్తున్న తరుణంలో అక్టోబర్ బాగుంటుందని గత పదేండ్ల చరిత్రను కొందరు విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. గత పది సంవత్సరాల్లో నిఫ్టీ తొమ్మిది సందర్భాల్లో సానుకూలంగా సగటున 2.9 శాతం రాబడుల్ని ఇచ్చిందని జేఎం ఫైనాన్షియల్ విశ్లేషకుడు నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఒక ఏడాదిలో ఏ నెలలోనూ సగటు రాబడి ఇంత ఎక్కువగా లేదన్నారు. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.3 శాతం సగటు రాబడిని ఇవ్వగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పైనాన్షియల్ ఇండెక్స్‌లు గత పదేండ్లలో 6.2 శాతం, 5.4 శాతం పెరిగాయి.