ముంబై, జూన్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 256.22 పాయింట్లు అందుకొని 82,45.21 వద్ద ముగిసింది. ఎస్ఎన్ఈ నిఫ్టీ 100.15 పాయింట్లు ఎగబాకి 25,103.20 వద్ద స్థిరపడింది. గడిచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,707 పాయింట్లు లేదా 2 శాతం, నిఫ్టీ 560 పాయింట్లు లేదా 2.27 శాతం చొప్పున పెరిగాయి. ప్రతీకార సుంకాలపై అమెరికా-చైనా దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. గడిచిన వారంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను అర శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ముఖ్యంగా ఎనర్జీ, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు కదంతొక్కాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.