ముంబై, నవంబర్ 26 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వచ్చే ఫెడ్ సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా తోడవడంతోపాటు దేశీయ మదుపరులు కూడా కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 85 వేల పాయింట్ల మైలురాయిని తిరిగి అధిగమించగా, నిఫ్టీ కూడా 26 వేల పైకి తిరిగి చేరుకున్నది. చివరకు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,022.50 పాయింట్లు లేదా 1.21 శాతం లాభపడి 85,609.51 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 320.50 పాయింట్లు లేదా 1.24 శాతం అందుకొని 26,205.30 వద్ద స్థిరపడింది. కేవలం తన రికార్డు స్థాయికి పది పాయింట్ల దూరంలో నిలిచింది. సెప్టెంబర్ 27, 2024 నిఫ్టీ రికార్డు స్థాయి 26,277 పాయింట్లకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో మదుపరుల సంపద రూ.5.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.474. 87 లక్షల కోట్లకు చేరుకున్నది.
దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి రూ.21 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. క్రితం వారంలో ఈ కీలక మైలురాయిని అధిగమించిన సంస్థ.. మళ్లీ బుధవారం రూ.21 లక్షల కోట్లను దాటింది. కంపెనీ షేరు ధర 1.99 శాతం ఎగబాకి రూ.1,569.75కి చేరుకున్నది. ఇంట్రాడేలో 2.12 శాతం ఎగబాకి 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్న షేరు చివర్లో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.21,24,259. 89 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీ షేరు 29 శాతం ఎగబాకినట్టు అయింది.