అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభంతో అంతటా స్టాక్, ఫారెక్స్, మెటల్, క్రూడాయిల్ ట్రేడింగ్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది.
ఏం జరుగుతున్నదో తెలియక మదుపరులు గతకొద్ది రోజులుగా అయోమయంలోపడగా.. పెట్టుబడుల ఉపసంహరణలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. రూపాయి మారకం విలువ తొలిసారి 94 మార్కు ఎగువకు దిగజారింది.
న్యూఢిల్లీ, మార్చి 23 : గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం.. భారత్‌పై గట్టిగానే ప్రభావం చూపుతున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లతోపాటు కరెన్సీ, బులియన్ మార్కెట్లూ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ముఖ్యంగా సోమవారం ట్రేడింగ్‌లో ఈ ఆటుపోట్లు మరింత స్పష్టంగా కనిపించాయి. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయంటూ.. 5 రోజులపాటు ఆ దేశంపై దాడులకు విరామం ఇస్తామన్నారు మరి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పరుగులు పెడుతున్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా రివర్స్‌గేర్ తీసుకున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు 96 డాలర్లకు దిగొచ్చింది. నిన్నమొన్నటిదాకా 120 డాలర్లలో ట్రేడైన సంగతి విదితమే. అయితే ఇరాన్ దీన్ని కొట్టిపారేస్తున్నది. ఎలాంటి చర్చలు జరుగట్లేదని, మార్కెట్లో చమురు ధరల్ని తగ్గించడానికి ట్రంప్ ఆడుతున్న నాటకంగా అభివర్ణించింది. అయితే అంతకుముందు స్టాక్ మార్కెట్లు మాత్రం భీకర నష్టాలను చూశాయి. ఉదయం ఆరంభం నుంచే పీకల్లోతు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెలలో మదుపరుల సంపద రూ.48 లక్షల కోట్లకుపైగా కరిగిపోయింది.
మొన్నటిదాకా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు అంతే వేగంతో దిగొస్తున్నాయి. తాజాగా ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ ఏకంగా రూ.9,050 తగ్గింది. రూ.1,43,600 (అన్ని పన్నులతో సహా) వద్ద స్థిరపడింది. జనవరి ఆఖర్లో మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికిన విషయం తెలిసిందే. ఇక కిలో వెండి ధర కూడా రూ.10,500 కోల్పోయి రూ.2,30, 000 (అన్ని పన్నులతో కలిపి) దగ్గర నిలిచింది. జనవరి 29న గరిష్ఠంగా రూ.4,04, 500గా నమోదైన సంగతి విదితమే. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ మార్కెట్లోనూ డిమాండ్ మందగించడమే ఇందుకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. మదుపరులు సైతం గల్ఫ్ సంక్షోభం దెబ్బకు పెరుగుతున్న ముడి చమురు ధరల దృష్ట్యా డాలర్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ కూడా గోల్డ్, సిల్వర్ రేట్లను దిద్దుబాటుకు గురిచేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు తాజా సరళిని విశ్లేషిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల భయాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి.
22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం బంగారం ధర రూ.9,450 తగ్గి రూ.1,24, 350గా ఉన్నది. గత వారం రోజులుగా రేట్లు క్రమేణా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. అంతకుముందు ధరలు పెరుగుతూపోవడంతో ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని చూశారని.. ఇప్పుడు తగ్గుతుంటే ఇంకా తగ్గుతాయేమోనన్న ఆశతో ఆగుతున్నారని జ్యుయెల్లర్స్ అంటున్నారు. దీంతో వ్యాపార లావాదేవీలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయని వాపోతున్నారు. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వాల్యూ 227.42 డాలర్లు దిగి 4,263.73 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ కూడా 4.25 డాలర్లు తగ్గి 63.53 డాలర్లకు పరిమితమైంది. జనవరి ఆఖర్లో ఔన్స్ గోల్డ్ 5 వేల డాలర్లకుపైగా పలికినది తెలిసిందే.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్రమేణా చతికిలపడుతున్నది. సోమవారమైతే తొలిసారి 94 మార్కు ఎగువ స్థాయికి దిగజారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద ఉదయం 93.84 వద్ద మొదలైన రూపీ.. ఒకానొక దశలో 94.03ను తాకింది. అయితే మళ్లీ 93.53 దగ్గరనే ముగిసింది. దీంతో తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఎక్కడిదక్కడే అన్నైట్టెంది. శుక్రవారం రూపీ వాల్యూ ఇదే స్థాయిలో ఆగిన విషయం విదితమే. అయినప్పటికీ రూపాయి మారకం విలువ మరో కొత్త కనిష్ఠానికి దిగజారడం.. ఫారెక్స్ మార్కెట్లో అలజడుల్నే సృష్టిస్తున్నది. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎగబాకుతుండటంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు విపరీతంగా ఆదరణ కనిపిస్తున్నది. ఈ ఒత్తిడితోనే భారతీయ కరెన్సీ బలహీనపడుతున్నది. అయితే చమురు ధరలు ఇలాగే తగ్గితే.. రూపీ తిరిగి బలోపేతం కాగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చగలదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.