ముంబై, డిసెంబర్ 22 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థలతోపాటు విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ర్యాలీ కారణంగా సూచీలు రికార్డు స్థాయిలో లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ తిరిగి 85 వేల పైకి, నిఫ్టీ 26,100 పాయింట్లను అధిగమించింది.
మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 638.12 పాయింట్లు అందుకొని 85,567.48 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 206 పాయింట్లు ఎగబాకి 26,172.40 వద్ద నిలిచింది. సూచీల్లో ట్రెంట్ 3.56 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్‌లు మూడు శాతం వరకు బలపడ్డాయి. అలాగే భారతీ ఎయిర్టెల్, భరత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటర్స్, రిలయన్స్, మారుతి షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, టైటాన్ షేర్లు నష్టపోయాయి.