ముంబై, నవంబర్ 5: స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు చివర్లో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు తిరిగి లాభాలబాట పట్టాయి. ఒకదశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలకు బ్యాంకింగ్, స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకుతోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను ముందువైపు నడిపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 694.39 పాయింట్లు ఎగబాకి 79,476.63 పాయింట్లకు చేరుకోగా, మరో సూచీ నిఫ్టీ సైతం 217.95 పాయింట్లు అందుకొని 24,213.30 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మదుపరులపై ప్రతికూల ప్రభావం చూపడంతో తొలి సెషన్లో అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా 78,300 పాయింట్ల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ మధ్యాహ్నాం తర్వాత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో తిరిగి కోలుకున్నదని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
టాప్ గెయినర్‌గా జేఎస్‌డబ్ల్యూ స్టీల్
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు టాప్ గెయినర్‌గా నిలిచింది. కంపెనీ షేరు ఐదు శాతానికి పైగా లాభపడింది. దీంతోపాటు టాటా స్టీల్ కూడా 4 శాతం ఎగబాకింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ, అదానీ పోర్ట్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా మెటల్ రంగ సూచీ అత్యధికంగా 2.38 శాతం ఎగబాకింది. దీంతోపాటు బ్యాంకింగ్, కమోడిటీస్, ఆర్థిక సేవలు, టెలికం, ఆటో, రియల్టీ, యుటిలిటీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.