హైదరాబాద్ (సిటీబ్యూరో), ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : చిన్న చిప్.. లక్షల రూపాయల విలువజేసే వాహనానికి ఆయువు పట్టు. అది కారుకి అమర్చకపోతే రోడ్డెక్కే అవకాశం లేదు. అదే సెమీకండక్టర్(కంప్యూటర్ చిప్). వాహనం ఎంత స్పీడ్‌తో వెళుతుంది? ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించింది? సీటు కదలికలు? డోర్స్ మూవింగ్? ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? పూర్తి సెన్సార్‌తో జరిగే పనితీరు మొత్తం ప్రోగ్రామింగ్ చేసే వ్యవస్థ పనిచేయాలంటే చిప్ అమర్చాల్సిందే. అట్లాంటి ముఖ్యమైన పాత్ర పోశిస్తున్న చిప్‌ల కొరతతో వాహన తయారీ పరిశ్రమ దూకుడుకు బ్రేక్‌లు పడింది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి వెళ్లే వారు కచ్చితంగా 2 నుంచి 4 నెలల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. అంతర్జాతీయంగా సెమీ కండక్లర్ల కొరత ఉండటంతో వాహనాల తయారీలో జాప్యం ఏర్పడటం ఇందుకు కారణం. వాహనాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ సెమీ కండక్టర్ కీలకం. అయితే ఈ చిప్‌లు థాయిలాండ్, చైనా, జపాన్ దేశాల్లోనే తయారవుతుండటంతో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కరోనా పరిస్థితులు కూడా జతవడంతో చిప్‌ల ఉత్పత్తి ఇంచుమించు పూర్తిగా నిలిచిపోయింది. ఈ కారణంతో ఆ చిప్‌లు దిగుమతి అవడం లేదని వాహన తయారీదారులు చెబుతున్నారు.