ఆదాయ డిక్లరేషన్, పన్ను చెల్లింపులు, రిటర్నులకు సంబంధించిన నిబంధనలు ఏటా మారుతున్నాయి. కొత్త నిబంధనలు వచ్చినప్పుడల్లా కొన్ని తికమకలు సహజం. మీ ఆదాయం పన్ను స్లాబులకు అనుగుణంగా ఉన్నప్పుడు స్టాండర్డ్ డిడక్షన్స్, సేవింగ్స్ పోను మిగతా ఆదాయానికి పన్ను చెల్లించక తప్పదు. ప్రస్తుతం ప్రతి అకౌంట్, దాదాపు ప్రతి లావాదేవీ పాన్ కార్డ్‌తో లింక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ఉన్నది ఉన్నట్టు చూపకపోయినా.. లేక మీ వ్యయాలు, లావాదేవీలకు తగ్గట్టుగా ఆదాయ డిక్లరేషన్ లేకపోయినా ఆదాయ పన్ను శాఖకు సులభంగానే తెలిసిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆదాయ, వ్యయాలను జాగ్రత్తగా డిక్లేర్ చేయడం మంచిది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేతనం, కాపిటల్ గెయిన్స్ డివిడెండ్, వడ్డీ ఆదాయంతోపాటు ఇతర ఆదాయాలను కూడా రిటర్నుల్లో చూపాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆయా సంస్థలు మీకు ఎంత చెల్లిస్తున్నాయన్న వివరాలను మీకంటే ముందుగానే ఆదాయ పన్ను శాఖకు అందజేస్తాయి. కనుక ఆ వివరాలను మీరు తప్పనిసరిగా పొల్లుపోకుండా డిక్లేర్ చేయాల్సిందే.
మీ పాన్ నంబర్‌తో జరిగిన లావాదేవీలన్నింటినీ ఫామ్-26ఏఎస్ రికార్డు చేసి ఉంచుతుంది. ఇది ఆదాయ పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. మీ పాన్ నంబర్ మీద మీకు వచ్చిన చెల్లింపుల్లో జరిగిన టాక్స్ డిడక్షన్స్ అన్నింటినీ ఇది రికార్డు చేస్తుంది. మరో రకంగా చెప్పాలంటే మీ టీడీఎస్లన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. ఈ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడం సులువవుతుంది.
మీరు జరిపే అధిక విలువైన లావాదేవీలు ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖ దృష్టికి వచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రూ.50 వేలకు మించిన నగదు డిపాజిట్లపై పాన్ నంబర్ వేయడం అన్ని బ్యాంకుల్లోనూ తప్పనిసరి. తద్వారా ఆ డిపాజిట్ ఆదాయ పన్ను శాఖ దృష్టికి చేరిపోతుంది. అలాగే రూ.10 లక్షలకు మించిన డిపాజిట్లు ఏ రూపంలో వచ్చినా.. వాటి పూర్తి వివరాలను బ్యాంకులు విధిగా ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. దీనికి తోడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిబెంచర్లు ఇతర పెట్టుబడి సాధనాల్లో రూ.10 లక్షలకు మించి పెడితే ఆ వివరాలన్నీ సదరు సంస్థ నుంచి ఆదాయ పన్ను శాఖకు వెళ్తాయి. అలాగే ప్రాపర్టీ కొనుగోళ్ల వివరాలు కూడా రిజిష్ట్రార్ కార్యాలయం ఐటీ శాఖకు చేరిపోతాయి. పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ ఎలాగూ పాన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి కనుక అవి కూడా ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి. ఈ వివరాలన్నీ ఫామ్-26ఏఎస్‌లో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆదాయ, వ్యయాల్లో ప్రతి పైసాకు మీ పాన్ కార్డే అతిపెద్ద సాక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మూడు నెలలకోసారి ఫామ్-26ఏఎస్‌ను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించడం మంచిది. తద్వారా మీ ఆదాయ, వ్యయాల్లో తేడాలేమైనా ఉంటే సరిదిద్దుకోవచ్చు.