Gold Hallmark | బంగారం ఆభరణాలు, కళాఖండాలపై వచ్చే నెల ఒకటో తేదీ నుంచి హాల్మార్కింగ్ రెండో దశ ప్రారంభం కానున్నది. బంగారం ఆభరణాలపై హాల్మార్కింగ్ అనేది వాటి స్వచ్ఛతకు సర్టిఫికెట్ వంటిది. గతేడాది జూన్ 16 నుంచి స్వచ్ఛందంగా అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం. తదుపరి దశల వారీగా బంగారం ఆభరణాలపై హాల్మార్కింగ్ తప్పనిసరి విధానాన్ని అమలు చేస్తున్నది. తొలి దశలో దేశంలోని 256 జిల్లాల్లో హాల్మార్కింగ్ అమలు చేసింది.
రెండో దశలో 20, 23, 24 క్యారట్ల బంగారం ఆభరణాలు, కళాఖండాలపై హాల్మార్కింగ్ తప్పనిసరి. కొత్తగా 32 జిల్లాల్లో హాల్మార్కింగ్ తప్పనిసరి చేస్తూ వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
హాల్మార్కింగ్ నోడల్ ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) విజయవంతంగా బంగారం ఆభరణాలకు తొలిదశలో హాల్మార్కింగ్ పూర్తి చేసింది. గతేడాది జూన్ 23 నుంచి ప్రతి రోజూ 256 జిల్లాల పరిధిలో మూడు లక్షలకు పైగా ఆభరరనాలకు హాల్మార్కింగ్ చేసింది.
బీఐఎస్ గుర్తింపు ఉన్న సంస్థల వద్ద హాల్మార్కింగ్ చేయని బంగారం స్వచ్ఛత (ప్యూరిటీ) తెలుసుకునేందుకు అనుమతించింది. నాలుగు బంగారం ఆభరణాల ప్యూరిటీ పరీక్షించడానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మరో ఐదు ఆభరణాలకు అదనంగా రూ.45 చెల్లిస్తే సరిపోతుంది.