న్యూఢిల్లీ, మే 13: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) సీఎండీ ఆర్పీ గుప్తాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధ్యతల నుంచి తొలగించింది. ఇందుకు గల కారణాలను ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ అక్రమాలకు అండగా ఉండటం వల్లే వేటు పడినట్టు తెలుస్తున్నది. అయితే నకిలీ ద్రువపత్రాలతో ఓ భారీ టెండర్‌కు రిలయన్స్ పవర్‌ను అనుమతించడమే కారణమని కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ)లోని వర్గాలు చెప్పుకుంటున్నాయి. సెకీ టెండర్లో బ్యాంక్ గ్యారెంటీగా ఎస్బీఐని చూపుతూ గత ఏడాది అక్టోబర్‌లో రిలయన్స్ పవర్ అక్రమాలకు పాల్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్బీఐ.. ఈ గ్యారెంటీని తిరస్కరించింది. అయినప్పటికీ గుప్తా సహకారంతో టెండర్ ప్రక్రియలో రిలయన్స్ పవర్ పాల్గొన్నదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎస్బీఐ తీవ్రంగా పరిగణించడంతో సెకీ చివరకు రిలయన్స్ పవర్ టెండర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది.
గుప్తా హయాంలో సెకీ అనేక విమర్శల్ని, అపవాదుల్ని ఎదుర్కోవడం గమనార్హం. రెన్యువబుల్ ఎనర్జీ వేలాలు, ప్రాజెక్టుల నిర్వహణలో సెకీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అంతేగాక జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అదానీ వంటి బడా సంస్థలకు సంబంధించిన వివాదాల్లోనూ సెకీ ఇరుక్కున్నది. మరోవైపు గుప్తా వేటుపై సెకీ, ఎంఎన్ఆర్ఈ, రిలయన్స్ పవర్ వర్గాలేవీ కూడా స్పందించేందుకు ముందుకు రావడం లేదు. కాగా, గుజరాత్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుప్తా.. 2023 జూన్ నుంచి సెకీ అధిపతిగా కొనసాగుతున్నారు. వచ్చే నెలతో ఈయన పదవీకాలం ముగియాల్సి ఉన్నది.