ముంబై, సెప్టెంబర్ 12 : స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం పలు కీలక సంస్కరణల్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే అతి భారీ సంస్థల కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) నిబంధనలను సరళతరం చేయాలని నిర్ణయించింది. సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ఇవి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి బడా ఐపీవోలకు కలిసిరానున్నాయి. క్యాపిటల్ మార్కెట్స్ బలోపేతానికి, దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, మదుపరుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడానికి వీలుగా కొత్త మార్గదర్శకాలకూ లైన్‌క్లియరైంది.
మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నియమాలను అందుకోవడానికున్న గడువును 10 ఏండ్లదాకా సెబీ పొడిగించింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం పాండే విలేకరులకు తెలియజేశారు. ఇక కొత్త విధివిధానాలు అమలైతే రూ.50,000 కోట్లు-లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో వచ్చే కంపెనీలకు ప్రస్తుతమున్న 10 శాతం కాకుండా 8 శాతం ఈక్విటీనే అవసరం. అలాగే 25 శాతం మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను మూడేండ్లకు బదులుగా ఐదేండ్లలోపు అందుకునే వెసులుబాటు కలగనున్నది. లక్ష కోట్ల రూపాయలకుపైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థలకు తప్పనిసరి ఆఫర్ రిక్వైర్మెంట్స్ 5 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించారు. రూ.5 లక్షల కోట్లకుపైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే 2.5 శాతం వాటా విక్రయిస్తే సరిపోతుంది. వీటికి 25 శాతం మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధన అమలుకు పదేండ్లదాకా గడువిచ్చారు. ఇప్పుడు 5 ఏండ్లుగానే ఉన్నది. దీంతో మొదట చిన్న ఐపీవోలతోనూ బడా సంస్థలు స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించే వీలు దొరుకుతున్నది. కాగా, ఐపీవోలో రూ.250 కోట్లకుపైగా కేటాయింపుల కోసం అనుమతి ఉన్న యాంకర్ ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచాలని కూడా సెబీ ఈ సందర్భంగా నిర్ణయించింది. ఇదిలా ఉంటే ప్రతినెలా దేశంలోకి వందమంది విదేశీ పోర్ట్‌ఫోలియో మదు పరులు వస్తున్నట్లు సెబీ తెలిపింది.