ముంబై/న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ఆర్థిక సెక్యూరిటీల విపణి (గ్రే మార్కెట్) కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రీ-ఐపీవో (ముందస్తు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) షేర్ ట్రేడింగ్ కోసం ఓ రెగ్యులేటెడ్ వేదికను పరిచయం చేయనున్నామన్న సంకేతాలను గురువారం సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఇచ్చారు. ఈ రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడున్న అన్‌రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫామ్స్ వేదికగా గ్రే మార్కెట్లో జరుగుతున్న లావాదేవీలను బాగా తగ్గించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఐపీవో అలాట్మెంట్, లిస్టింగ్ మధ్య ఉండే 3 రోజుల వ్యవధిలో అధికారికంగా షేర్ల ట్రేడింగ్‌కు మదుపరులకు అనుమతి లభించే వీలు కూడా లేకపోలేదన్నారు.
ఫిక్కీ క్యాపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్ 2025లో పాండే మాట్లాడుతూ.. మదుపరులు తమ పెట్టుబడులపై ఓ నిర్ణయానికి రావడానికి ప్రీ-లిస్టింగ్ సమాచారం అన్నివేళలా చాలదన్నారు. అందుకే మదుపరుల ప్రయోజనాల రక్షణార్థం క్యాపిటల్ మార్కెట్‌ను మరింత సురక్షితం చేయడానికి ప్రీ-ఐపీవో కంపెనీలు సైతం కొన్ని నిబంధనలకు లోబడి ట్రేడింగ్ చేసుకునేందుకు వీలుగా ఓ రెగ్యులేటెట్ వేదికను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే నియంత్రణ లేని వేదికలపై అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్‌కు అడ్డుకట్ట పడుతుందన్నారు.
ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ కోసం ఐపీవో ముగిసిన తర్వాత, ట్రేడింగ్ మొదలవడానికి మధ్య కనీసం మూడు ట్రేడింగ్ డేస్ వ్యత్యాసం ఉంటున్నది. ఈ సమయంలోనే గ్రే మార్కెట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇవి ఇన్వెస్టర్లకు రిస్క్ అని సెబీ చెప్తున్నది. అయినా ఏమాత్రం ఆగడం లేదు. పైగా పెద్ద ఎత్తున మార్కెట్లోకి ఐపీవోలూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 70కిపైగా పబ్లిక్ ఇష్యూలు వచ్చినట్టు సమాచారం. ఈ నెలలోనే 11 సంస్థలు ఐపీవోల్ని తెచ్చాయి. వచ్చే వారం మరికొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫామ్‌ను సెబీనే తేవాలని భావిస్తున్నది.
ఈక్విటీ డెరివేటివ్‌ల ప్రొడక్ట్స్ మెచ్యూరిటీ, టెన్యూర్‌ను పెంచాలని సెబీ చూస్తున్నది. దీనివల్ల సదరు ప్రొడక్ట్స్‌ల్లో ట్రేడింగ్‌ను అదుపు చేయవచ్చని భావిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) వ్యక్తిగత ట్రేడర్లలో 91 శాతం మంది నష్టాలనే ఎదుర్కొన్నారు. దీంతో క్యాష్ ఈక్విటీ మార్కెట్ల బలోపేతానికి ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో సెబీ పడింది. ఇందులో భాగంగానే మరింత కాలపరిమితి ఉండే ప్రొడక్ట్స్ ద్వారా డెరివేటివ్‌ల నాణ్యతను పెంచాలనుకుంటున్నది. ‘ప్రభావవంతమైన హెడ్జింగ్, లాంగ్-టర్మ్ ఇన్వెస్టింగ్‌కు వీలుగా మరింత లాభసాటిగా డెరివేటివ్ ప్రొడక్ట్స్ మెచ్యూరిటీకి భాగస్వాముల అభిప్రాయాలను తీసుకుంటాం’ అని పాండే తెలిపారు.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మోసం కేసులో మదుపరులు తమ క్లెయిములను దాఖలు చేయడానికున్న గడువును సెబీ ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించింది. 2020 నవంబర్ 23న కార్వీని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఓ డిఫాల్టర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్వీ బాధిత మదుపరుల నుంచి క్లెయిముల దాఖలుకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ 2తోనే ఈ గడువు తీరిపోయింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31దాకా దాన్ని పెంచుతున్నట్టు సెబీ తాజాగా తెలిపింది. ఇంకా తమ క్లెయిములను సమర్పించని ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో కోరింది. అలాగే మరిన్ని వివరాల కోసం ఎన్ఎస్ఈని దాని టోల్-ఫ్రీ నెంబర్ 1800 266 0050 ద్వారా సంప్రదించవచ్చని, లేదా defaultisc@nse.co.inకు ఈ-మెయిల్స్ పంపవచ్చని సూచించింది. ఇక పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేస్తూ ఇన్వెస్టర్ల సొమ్మును పక్కదారి పట్టించిన ఈ కేసులో కార్వీ సీఎండీ సీ పార్థసారథిని 2023 ఏప్రిల్‌లోనే సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడేండ్లపాటు సెబీ నిషేధించిన సంగతి విదితమే. రూ.21 కోట్ల జరిమానాను కూడా విధించింది.