SEBI- Karvy | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘కార్వీ’, ఆ సంస్థ సీఎండీ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాలను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ జప్తు చేసింది. రూ.25 కోట్ల బకాయిల వసూలు కోసం కార్వీ కంపెనీతోపాటు కార్వీ సీఎండీ సీ పార్ధసారధి ఖాతాలను జప్తు చేసినట్లు తెలిపింది. స్టాక్ మార్కెట్లో షేర్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లోనూ కార్వీ తన కస్టమర్ల పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.
అయితే కస్టమర్లు ఇచ్చిన పవరాఫ్ అటార్నీ (పీఓఏ)ను దుర్వినియోగం చేశారని కార్వీ యాజమాన్యంపై ఆరోపణల విషయమై గత నెల ఏడో తేదీన కంపెనీకి, కంపెనీ సీఎండీ పార్ధసారధికి సెబీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కస్టమర్ల బకాయిలు చెల్లించాలని ఆ నోటీసుల్లో సెబీ ఆదేశించింది. ఇప్పటికే సెబీ విధించిన జరిమాన చెల్లించడంలో కార్వీ విపలమైంది.
ఈ నేపథ్యంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సంస్థ సీఎండీ పార్ధసారధిలపై ఏడేండ్ల పాటు సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. అంతే కాదు కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై రూ.13 కోట్లు, పార్ధసారధిపై రూ.8 కోట్ల జరిమాన విధించింది. ఖాతాదారులకు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ.15.34 కోట్లు, పార్ధసారధి రూ.9.44 కోట్ల బకాయిలు ఉన్నాయి.