న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 16 : హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న యశోద హాస్పిటల్స్ (యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్), ఆర్ఎస్ బ్రదర్స్ (ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా) సంస్థల పబ్లిక్ ఇష్యూ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీవో)లకు మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అధికారిక సమాచారం విడుదలైంది. వీటితోపాటు మరో ఐదు కంపెనీల నిధుల సమీకరణకూ పచ్చ జెండా ఊపింది. వాటిలో ముంబైకి చెందిన ఇన్సూర్టెక్ వేదిక టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, కోల్‌కతా ఆధారిత కస్టమర్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఫ్యూజన్ సీఎక్స్, నవీ ముంబై కేంద్రంగా సాగుతున్న వ్యర్థ జలాల శుద్ధి పరిష్కారాల కంపెనీ ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే గురుగ్రామ్‌కు చెందిన ఓరియంట్ కేబుల్స్ ఇండియా, కాన్పూర్ ఆధారిత లోహియా కార్ప్ ఐపీవోలకూ లైన్ క్లియరైంది.
కాగా, ఈ ఏడు సంస్థల్లో యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్, టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్ రహస్య మార్గంలో ప్రీ-ఫైలింగ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీకి దాఖలు చేశాయి. మిగతా ఐదు సంస్థలు మాత్రం సాధారణంగానే డ్రాఫ్ట్ పేపర్లను ఫైల్ చేశాయి. ఇక ఈ సంస్థలన్నీ పబ్లిక్ ఇష్యూల ద్వారా మార్కెట్ల నుంచి రూ.10,000 కోట్లకుపైగానే నిధులను సేకరించనున్నాయి. కాగా, ఈ ఏడాది మే-సెప్టెంబర్ మధ్య ఈ సంస్థలన్నీ ఐపీవోల కోసం సెబీకి దరఖాస్తులు చేసుకోగా, ఈ నెల 8-12 మధ్య అనుమతుల్ని అందుకున్నాయి. ఇవన్నీ కూడా ఐపీవోల అనంతరం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో నమోదు కానున్నాయి.
ఆర్ఎస్ బ్రదర్స్ ఆగస్టులో సెబీకి డీఆర్‌హెచ్‌పీ పత్రాలను దాఖలు చేసింది. రూ.500 కోట్లదాకా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉండనున్నది. అలాగే మరో 2.98 కోట్ల ఈక్విటీ షేర్లు వాటాదారుల ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కు పెట్టనున్నారు. వీటి విలువ సుమారు రూ.1,000 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తున్నది. ఇలా మొత్తంగా రూ.1,500 కోట్ల నిధులను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ సేకరించనున్నది. ఇక ఈ నిధులను సంస్థాగత రుణ భారాన్ని తీర్చుకోవడానికి, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్ల ఏర్పాటుకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వాడుకుంటారని సమాచారం.
యశోద హాస్పిటల్స్ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,000-4,000 కోట్ల మేర నిధులను సమీకరించాలని భావిస్తున్నది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ రెండూ ఉండనున్నాయి. అయితే సెప్టెంబర్‌లో ప్రీ-ఫైలింగ్ డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేయడంతో ఐపీవోకు ఏడాదిన్నరదాకా సమయం ఉన్నది. ఈలోగా అప్డేటెడ్ డీఆర్‌హెచ్‌పీని దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా, సమీకరించిన ఈ నిధులతో దవాఖానల విస్తరణ, ఇతరత్రా సేవలను బలోపేతం చేయనున్నట్టు సమాచారం.
