Trafiksol SME – SEBI | ట్రాఫిక్, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సిస్టమ్స్ నిర్వహణకు సాఫ్ట్ వేర్లు అందించే ట్రాఫిక్ సోల్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఇటీవలే ఐపీఓ ద్వారా వాటాలు విక్రయించిన ట్రాఫిక్ సోల్ సంస్థ యాజమాన్యాన్ని.. సదరు వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు సొమ్ము తిరిగి చెల్లించాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింది. ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ ఐపీఓను రద్దు చేస్తున్నట్లు సెబీ మంగళవారం ప్రకటించింది. నోయిడా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థపై ఫిర్యాదులు రావడం వల్లే సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అంతే కాదు.. మదుపర్ల సొమ్ము రీఫండ్ ప్రక్రియను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలని బీఎస్ఈని ఆదేశించింది.
ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ సంస్థ రూ.45 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా ఐపీఓకు వెళ్లింది. గత సెప్టెంబర్ 10న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై 12న ముగిసింది. షేర్ శ్రేణి రూ.66-70 మధ్య నిర్ణయించిన ఈ సంస్థ ఐపీఓ 345.65 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. గత సెప్టెంబర్ 17న దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ లిస్ట్ కావాల్సి ఉంది కానీ స్మాల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సెబీకి ఫిర్యాదు అందింది.
ఒక వెండర్ నుంచి రూ.17.70 కోట్ల ఖర్చుతో ట్రాఫిక్ సోల్ సంస్థ కొనుగోలు చేసిన సాఫ్ట్ వేర్ లావాదేవీల్లో స్మాల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సందేహాలు వ్యక్తం చేసింది. ఆ సాఫ్ట్ వేర్ కొనుగోలు లావాదేవీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించలేదని సెబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సెబీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ సంస్థ లిస్టింగ్‌ను బీఎస్ఈ నిలిపేసింది. తాజాగా స్మాల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదుపై విచారణ తర్వాత ఐపీఓను రద్దు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లను రద్దు చేసి, వారి సొమ్మును వారి డీమ్యాట్ ఖాతాల్లో బదిలీ చేయాల్సి ఉంటుంది. సెబీ తుది ఆదేశాలకు అనుగుణంగా తాజాగా ఐపీఓకు వెళ్లడానికి సంప్రదించే వెసులుబాటును ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ సంస్థ యాజమాన్యానికి సెబీ కల్పించింది.