న్యూఢిల్లీ, డిసెంబర్ 17: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇప్పట్లో పెరగదా? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎస్బీఐ తాజా అధ్యయనం కూడా దీనికి తగ్గట్టుగానే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లోనే రూపీ నష్టాలు ఆగవచ్చని, అప్పుడే ఫారెక్స్ మార్కెట్లో తిరిగి రూపాయి బలపడవచ్చని బుధవారం వచ్చిన నివేదికలో ఎస్బీఐ రిసెర్చ్ పేర్కొనడం గమనార్హం. అయితే భారత్‌పై అమెరికా 50 శాతం వాణిజ్య సుంకాలే రూపీ నష్టాలకు ప్రధాన కారణమని ఎస్బీఐ రిసెర్చ్ అంటున్నది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి రూపాయి మారకపు విలువ 5.7 శాతం పడిపోయిందని గుర్తుచేస్తున్నది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం తగ్గడం కూడా రూపాయి కష్టాలకు కారణమేనన్న అభిప్రాయాలు ఫారెక్స్ ట్రేడర్ల నుంచి వినిపిస్తున్నాయి. మంగళవారం మునుపెన్నడూ లేనివిధంగా రూపాయి మారకం విలువ 91 మార్కును దాటిపోయిన విషయం తెలిసిందే. ఇంట్రా-డేలో తొలిసారి 91.14ను తాకింది. అయితే చివరకు 90.93 వద్ద ముగిసింది. రూపీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి. కాగా, బుధవారం 55 పైసలు కోలుకుని 90.38 వద్ద స్థిరపడింది.
రూపాయి నష్టాలు.. దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలే. విదేశీ దిగుమతులన్నీ భారమైపోతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడమేగాక, దేశంలోని డాలర్ నిల్వలూ హరించుకుపోతాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యం మొత్తం డాలర్లలోనే జరుగుతుంది. అమెరికా డాలరే ప్రపంచ కరెన్సీగా ఉన్నది మరి. అందుకే దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఇంతలా డిమాండ్ ఉంటుంది. మరోవైపు రూపీ పతనం దృష్ట్యా ఆయా దేశాలతో స్థానిక కరెన్సీల్లో వ్యాపారానికి ఆర్బీఐ పావులు కదుపుతున్నా.. నిరాశే మిగులుతున్నది.
ఇక దేశీయ ఇంధన అవసరాలు ఇప్పుడు 85 శాతానికిపైగా విదేశీ ముడి చమురు దిగుమతుల ద్వారానే తీరుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రూపాయి బలహీనత క్రూడాయిల్‌ను ఇంకా ఖరీదెక్కిస్తున్నది. ప్రస్తుతం క్రూడ్ ధరలు గతంతో పోల్చితే తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ రూపీ నష్టం కారణంగా అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. దేశంలోకి దిగుమతయ్యే అన్ని వస్తూత్పత్తులదీ ఇదే దుస్థితి. పరిస్థితులు ఇలాగే ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.