న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ద్వారా భారీ మొత్తంలో నిధుల్ని సమీకరించింది. ఎనర్జీ ఆపర్చూనిటీస్ ఫండ్ పేరుతో తాజాగా జారీచేసిన ఎన్ఎఫ్వో ద్వారా రూ. 5,000 కోట్లు సేకరించాలని ఎస్బీఐ ఎంఎఫ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇంతకంటే అధికంగా ఇన్వెస్టర్లు రూ.6,700 కోట్ల పెట్టుబడుల్ని కుమ్మరించారు. అన్ని డిస్ట్రిబ్యూషన్ చానళ్ల నుంచి తమ ఎన్ఎఫ్వోకు విస్త్రత స్పందన లభించిందని, దీనికి వచ్చిన దరఖాస్తుల సంఖ్య సైతం 5 లక్షలను మించిందని సోమవారం ఫండ్ హౌస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
ఈ ఎన్ఎఫ్వోలో పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు పాలుపంచుకున్నారని ఎస్బీఐ ఎంఎఫ్ వెల్లడించింది. ఎనర్జీ థీమ్ పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసాన్ని ఈ స్పందన ధృవపరుస్తున్నదని పేర్కొంది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అయిన ఎనర్జీ ఆపర్చూనిటీస్ ఫండ్ నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్‌ను అనుసరిస్తూ ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ స్కీము ఆస్తుల్లో 80-100 శాతం కొత్త, సాంప్రదాయ ఇంధన రంగానికి చెందిన కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఫండ్ మేనేజర్లు పెట్టుబడి చేస్తారు. ఆయా కంపెనీల ఈక్విటీ డెరివేటివ్స్, డెట్ సెక్యూరిటీలు, డెట్ డెరివేటివ్స్, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్స్లో సైతం ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ స్కీమ్‌కు ఫండ్ మేనేజర్లుగా రాజ్ గాంధి, ప్రదీప్ కేశవన్లను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నియమించింది.