న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎస్బీఐ గృహ రుణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌తో ప్రస్తుత త్రైమాసికంలోనే గృహ రుణాల మంజూరు రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశాలున్నాయని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాలు రూ.9 లక్షల కోట్లు దాటాయి. దేశవ్యాప్తంగా మంజూరు అవుతున్న గృహ రుణాల్లో బ్యాంక్ వాటా 28 శాతంగా ఉన్నదని, దీంతో ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
వేగవంతంగా గృహ రుణాలను మంజూరు చేయడానికి దేశవ్యాప్తంగా 460 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు, తద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నదని ఆయన చెప్పారు. పారదర్శకత, డాక్యుమెంటేషన్, బిల్డర్ల నేపథ్య పరిశీలన వంటి బ్యాంక్ ప్రక్రియలపై వినియోగదారులు నమ్మకాన్ని ఉంచడం వల్లనే ఇది సాధ్యమవుతున్నదన్నారు. రూ.30 లక్షల కోట్లకు పైగా ఉన్న గృహ రుణాల మార్కెట్ ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిందన్నారు.