న్యూఢిల్లీ, జూలై 2: మూలిగే నక్కమీద తాటిపండుపడ్డ చందంగా తయారైంది అనిల్ అంబానీ పరిస్థితి. ఇప్పటికే వ్యాపారాలు సాగక, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ చోటా అంబానీకి.. ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఒకప్పటి టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తమ దగ్గర తీసుకున్న రుణాన్ని మోసంగా ప్రకటించాలని నిర్ణయించింది మరి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు పంపించే నివేదికలో ఆర్‌కామ్ అధినేతగా అనిల్ అంబానీ పేరునూ ఎస్బీఐ చేర్చుతుండగా.. దీనికి సంబంధించి గత నెల 23న ఎస్బీఐ నుంచి ఓ లేఖను అందుకున్నట్టు ఆర్‌కామ్ బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. దీంతో గతంలో ఆర్‌కామ్‌కు లోన్లు ఇచ్చిన ఇతర బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లూ ఇదే దారిని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయిప్పుడు.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐసహా ఆయా బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తాజా ఫైలింగ్‌నుబట్టి తెలుస్తున్నది. అయితే ఈ నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో ఎస్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్ నడుచుకున్నట్టు పేర్కొన్న బ్యాంక్.. దీన్నో మోసపూరిత రుణంగా వర్గీకరించాలని తమ ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ తీర్మానించినట్టు తేల్చిచెప్పింది. ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుకోవాలని.. అలాగే రూ.12,692.31 కోట్లను కనెక్టెడ్ పార్టీల చెల్లింపులకు వినియోగించాలన్నది నిబంధన. కానీ 2016లో రుణ చెల్లింపులకు రూ.6,265.85 కోట్లను, కనెక్టెడ్ పార్టీలకు రూ.5,501.56 కోట్లనే ఇచ్చారని ఎస్బీఐ చెప్తున్నది. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.250 కోట్ల రుణం, ఐఐఎఫ్‌సీఎల్ నుంచి పొందిన రూ.248 కోట్ల రుణాలకు సంబంధించి కూడా ఇదే అవకతవకల్ని గుర్తించినట్టు సమాచారం. కాగా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటిస్తే.. 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించాల్సి ఉంటుంది. అంతేగాక పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఫిర్యాదు చేయాలి.
ఆర్‌కామ్ రుణాన్ని మోసంగా ఎస్బీఐ ప్రకటించడం.. ఆర్బీఐ నిబంధనలకు, కోర్టు ఆదేశాలకు విరుద్ధమని అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. ఈ మేరకు బుధవారం ఎస్బీఐకి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. ‘ఎస్బీఐ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. ఆర్బీఐ మార్గదర్శకాలతోపాటు గతంలో సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా ఉందని న్యాయవాది గుర్తుచేశారు. నిజానికి అనిల్ అంబానీ స్పందించినా.. ఎస్బీఐ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని, ఈ వ్యవహారంలో బ్యాంక్ తీరు ఆక్షేపించేలా ఉందన్నారు. దీన్ని అంబానీ న్యాయపరంగానే ఎదుర్కొంటారని స్పష్టం చేశారు.