పొదుపు అనేది ప్రతీ ఒక్కరికీ తప్పక ఉండాల్సిన లక్షణం. అయితే దాన్ని ఏ వయసులో ఎలా అనుసరించాలో కొద్దిమందికే తెలుసు. మరి నిపుణుల సలహాలేమిటో చూసేద్దాం పదండి.
20 ఏండ్ల వయసులోనే పొదుపునకు శ్రీకారం చుట్టాలి. మీ సేవింగ్స్‌కు పునాది పడేది ఈ వయసులోనే. కాబట్టి కేవలం రూ.500తో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ప్రారంభించినా కొంతకాలం తర్వాత దానివల్ల అందుకొనే లాభం పెద్ద మొత్తంలోనే ఉంటుందని మరువద్దు.
30 ఏండ్ల వయసులో మీరు ఏదో ఓ ఉద్యోగం చేస్తూనే ఉంటారు. కనుక మీ వార్షిక ఆదాయానికి సమానంగా పొదుపు మొదలుపెట్టండి. ఇందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ను వినియోగించుకోండి.
40 ఏండ్ల వయసుకు రాగానే ప్రతీ ఒక్కరికీ తమతమ జీవితాల్లో ప్రాధాన్యతలు మారిపోతూ ఉంటాయి. పిల్లల చదువు, మీ పదవీ విరమణ అనంతర జీవితం, భవిష్యత్తులో అనారోగ్య సంబంధిత వ్యయాలకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి తగ్గట్టుగా పెట్టుబడులను పెంచుకుంటూ పోవాలి. అలాగే రుణ భారాన్ని అదుపులో కూడా ఉంచుకోవాలి.
వయసు 50 ఏండ్లు దాటిందంటే రిటైర్మెంట్ జీవితంపై దృష్టి పెట్టాలి. ఇప్పటిదాకా చేసిన సేవింగ్స్‌ను, ఇన్వెస్ట్మెంట్లను స్థిరంగా కొనసాగిస్తూ 60 ఏండ్లకు ఆ సొమ్ము మీ అవసరాలకు అందివచ్చేలా ఉండాలి. పరిమిత ఖర్చులతో ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి.
60 ఏండ్లు దాటిన తర్వాత అందరికీ ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. అప్పటిదాకా మనం చేసిన సేవింగ్స్, పెట్టుబడులే మనకు ఆధారం. అయితే ఈ వయసులోనూ సురక్షిత పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లవచ్చు. అందుకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్), యాన్యుటీలు లేదా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) వంటివి ఉన్నాయి. కొన్ని బ్యాంకులు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ కూడా ఇస్తూ ఉంటాయి.
అన్నింటికంటే ముఖ్యంగా సమగ్ర ఆరోగ్య బీమా ఉండాలన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి ముందు నుంచే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్తోపాటు హెల్త్ ఇన్సూరెన్స్కూ పెద్దపీట వేయాలి. అప్పుడే ముదిమి వయసులో ఎవరి మీదా ఆధారపడకుండా స్వేచ్ఛగా జీవించవచ్చు.