HPCL-IDFC First Bank | పెట్రోల్, డీజిల్ ధరలు తడిసిమోపెడవుతున్నాయ్.. రోజువారీ ఖర్చులూ పెరిగిపోతున్నాయ్.. ఈ క్రమంలో వాహనాల యజమానులకు రిలీఫ్ కల్పించేందుకు కేంద్ర చమురు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం వివిధ బ్యాంకులతో కలిసి కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నాయి. అందులో భాగంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఓ అడుగు ముందుకేసింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సహకారంతోపాటు `రూపే` సంస్థతో కలిసి హెచ్‌పీసీఎల్ కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది. హెచ్‌పీ పే యాప్ ద్వారా ఈ కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డుతో పెట్రోల్ లేదా డీజిల్ బిల్లులు చెల్లించే వారికి 6.5 శాతం మనీ పొదుపు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో హెచ్‌పీసీఎల్ 1.5 శాతం క్యాష్‌బ్యాక్, సర్‌చార్జి మాఫీ, వాల్యూ బ్యాక్ కలిపి ఉన్నాయి.
ఈ క్రెడిట్ కార్డుతో దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా హెచ్‌పీసీఎల్ రిటైల్ పెట్రోల్ పంపుల వద్ద హెచ్‌పీ పే యాప్ ద్వారా చెల్లింపులు జరిపి బెనిఫిట్లు పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డు రూపే నెట్‌వర్క్‌పై పని చేస్తుంది. ఫ్యుయల్తోపాటు యుటిలిటీ, లైఫ్ స్టయిల్ సహా పలు ఆకర్షణీయ మర్చంట్ ఆఫర్లు అందిస్తున్నది.
హెచ్‌పీసీఎల్-ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రెండు వేరియంట్లలో లభిస్తుంది.. అవి ఫస్ట్ పవర్, ఫస్ట్ పవర్ +. ఈ క్రెడిట్ కార్డు కావాల్సిన వారు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెబ్సైట్, యాప్ ద్వారా పొందొచ్చు. ఎంపిక చేసిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ శాఖలు, హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద తీసుకోవచ్చు. ఈ కార్డు తీసుకున్న వారికి జాయినింగ్ ఫీజు ఫ్రీ. ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డుపై రూ.199, ఫస్ట్ పవర్ + క్రెడిట్ కార్డుపై రూ.499 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.