అమీన్పూర్,అక్టోబర్ 15: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో సాల్జ్ గిట్టర్ లిప్ట్ పరిశ్రమను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో లింగ అంతరం అధికంగా ఉందని, ప్రధానంగా భారీ ఇంజినీరింగ్ విభాగంలో మహిళల పాత్ర చాలా తక్కువని అన్నారు. ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సుల్తాన్పూర్ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసి, మహిళల కోసం కొన్ని పరిశ్రమలను ప్రత్యేకంగా కేటాయించి వారిని ప్రోత్సహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ శ్రీధర్ గోపిశెట్టి, దక్షిణ మధ్య రైల్వే సీఈవో రవీన్‌రెడ్డి, ఎస్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.