Bank Locker | నగలు, డాక్యుమెంట్ల వంటి విలువైనవాటి కోసం నమ్మదగిన బ్యాంకింగ్ సేవల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లదే కీలకపాత్ర. అందుకే ఇటీవలికాలంలో వీటికి ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నాయి. ఇండ్లలో భద్రత అంతంతమాత్రంగా ఉండటం కూడా ఈ లాకర్ల గిరాకీని అమాంతం పెంచేసింది. మరి లాకర్లలో ఏయే రకాలుంటాయి? వాటికి వర్తించే చార్జీలు ఎలా ఉంటాయి? అన్న వివరాలు తెలుసా? అయితే మీ కోసమే ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో లాకర్లు, వాటి చార్జీల గురించి తెలుసుకుందాం.
లాకర్ పరిమాణం, గ్రామీణ, పట్టణ, నగర, మెట్రో నగరాలనుబట్టి లాకర్ల చార్జీలు మారుతూ ఉంటాయి. బ్యాంక్ పాలసీలపైనా ఇవి ఆధారపడి ఉంటాయి. ఆయా బ్యాంకుల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా అదనంగా పడుతుంది. ఇక అటు ఖాతాదారులు, ఇటు బ్యాంకర్లు లాకర్ల విషయంలో బాధ్యతాయుతంగా ఉండాల్సి ఉంటుంది. షరతులు వర్తిస్తాయి. లాకర్లు అందుబాటులో ఉంటేనే ఖాతాదారులకు బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్‌కు లాకర్ ఇవ్వాలా? వద్దా? అన్నది బ్యాంక్ శాఖదే తుది నిర్ణయం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వన్-టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఫీజు చిన్న, మధ్యశ్రేణికిగాను రూ.500 (జీఎస్టీ అదనం) ఉంటుంది. భారీ, అతి భారీ లాకర్లకు ఈ ఫీజు రూ.1,000 (జీఎస్టీ అదనం)గా ఉన్నది. అలాగే లాకర్ సైజునుబట్టి వార్షిక చార్జీలు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు ఉన్నాయి.
ఒకే నగరం లేదా ప్రాంతంలో ఉన్నప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖల్లో లాకర్ చార్జీలు వేర్వేరుగా ఉంటున్నాయి. అద్దెలు వార్షిక ప్రాతిపదికన చెల్లించాలి. అలాగే అడ్వాన్స్లూ ఉంటాయి. లాకర్ పరిమాణాన్నిబట్టి, బ్యాంక్ శాఖ, మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా లాకర్ చార్జీలు వర్తిస్తాయి. కాబట్టి లాకర్ అవసరమనుకున్నవారు సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖను సంప్రదించడం ఉత్తమం. లాకర్నుబట్టి కనిష్ఠంగా రూ.1,100, గరిష్ఠంగా రూ.20,000 చార్జీలుంటాయి. ఇక చార్జీలపై 18 శాతం జీఎస్టీ కూడా పడుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్.. ఒకే నగరం, ప్రాంతంలో ఉన్నా లాకర్ అద్దె చార్జీల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి లాకర్ సైజ్, బ్యాంక్ ఉన్న చోటునుబట్టి చార్జీలుంటాయి. లాకర్ అద్దెను వార్షిక ప్రాతిపదికన తీసుకుంటారు. అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లాకర్ అగ్రిమెంట్లో నిబంధనలు, షరతులు ఉంటాయి. వీటికి లోబడి కస్టమర్లు నడుచుకోవాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో గ్రామీణ, పట్టణ శాఖల్లో వన్-టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200గా ఉన్నది. నగర, మెట్రో నగరాల్లో రూ.500. వార్షిక చార్జీలు లాకర్ సైజునుబట్టి రూ.1,250 నుంచి రూ.10,000 వరకు ఉంటాయి.