Rs.2000 Effect on Rural | రూ.2000 విలువైన నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేకించి రూ.2000 నోట్లు దాచి పెట్టుకున్న వారిలో కలవరం ఎక్కువైంది. నల్లధనం దాచి పెట్టుకున్న వారు దిక్కు తోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నాడు బ్లాక్ మనీని అరికట్టేందుకు పాత పెద్ద నోట్లు రద్దు చేసినట్లు కేంద్రం, ఆర్బీఐ ప్రకటించాయి. ఇప్పుడు రూ.2000 నోటు రద్దు చేయడం వల్ల పాత పెద్ద నోట్ల రద్దు విఫలమైనట్లేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో 2016లో మాదిరిగా ప్రజలు తమ వద్ద ఉన్న నగదు నోట్లను మార్చుకోవడానికి, తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుల ముందు బారులు తీరాల్సి రావడం అంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులపైనే భారం పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
2016లో పాత పెద్ద నోట్ల రద్దు.. ఇప్పుడు రూ.2000 నోట్ల రద్దు.. నాడూ నేడు కేంద్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలా నోట్లు రద్దు చేయడం వల్ల ప్రజల్లో కరెన్సీ అంటేనే అనుమానం తలెత్తే పరిస్థితులు తోసుకొస్తున్నాయి. ఇప్పుడు రూ.500 నోట్లైనా చలామణిలో ఉంటాయా? అని సామాన్యుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో కేంద్ర బ్యాంకుపై ఉన్న గౌరవం రోజురోజుకు తగ్గిపోతున్నదని చెబుతున్నారు. నోట్ల మార్పిడికి తాము బ్యాంకుల చుట్టూ తిరగడం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామీణులు చెబుతున్నారు.
ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు అమల్లోకి వచ్చినందున పెద్దగా ఎకానమీపై ప్రభావం ఉండకపోవచ్చు. కానీ రియాల్టీ రంగంలో పని చేస్తున్న వారు తాజా నిర్ణయంతో ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.