న్యూఢిల్లీ/ముంబై, మే 4: కరెన్సీ మార్కెట్లో డాలర్ ముందు రూపాయి వెలవెలబోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. డాలర్ల సమీకరణకున్న మార్గాలను అన్వేషిస్తున్నది. నానాటికీ బలహీనపడుతున్న రూపీతో దేశీయ ఫారెక్స్ రిజర్వులు (విదేశీ మారకద్రవ్య నిల్వలు) కరిగిపోతున్నాయి మరి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను ఎగదోస్తున్నది. ఇది కూడా రూపాయిని అమ్మకాల ఒత్తిడికి గురిచేస్తున్నది. అందుకే దేశంలోని డాలర్ల నిల్వలను పెంచుకొనేందుకున్న మార్గాలను ఆర్బీఐ వెతుకుతున్నదని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 5.5 శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి వద్ద నిలిచింది.
దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు కూడా భారత ఫారెక్స్ రిజర్వులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి 19 బిలియన్ డాలర్ల పెట్టుబడులను విదేశీ మదుపర్లు ఉపసంహరించుకున్నారు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖర్లో మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ ఫారెక్స్ రిజర్వులు 728.5 బిలియన్ డాలర్లను తాకాయి. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల దెబ్బకు కేవలం 2 నెలల్లో 30 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. ఏప్రిల్ చివర్లో 698.5 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.
దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దీంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ సహజంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు విజృంభిస్తుండటంతో డాలర్లకు గిరాకీ ఇంకా పెరిగింది. దీంతో రూపాయికి నష్టాలు తప్పట్లేదు. రూపీ నష్టాల నివారణకు ఆర్బీఐ అటు స్పాట్, ఇటు ఫార్వర్డ్ ఫారెక్స్ మార్కెట్ లావాదేవీల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది. అయినప్పటికీ గల్ఫ్ వార్.. ఆశించినంత మేర అనుకూల ఫలితాలు అందకుండా చేస్తున్నది.
దేశంలో డాలర్ల నిల్వలను పెంచేందుకు నాన్-రెసిడెంట్ ఇండియన్స్ నుంచి డాలర్ల డిపాజిట్లను స్వీకరించడం, భారతీయ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడుతున్న విదేశీ మదుపర్లపై వేస్తున్న 5 శాతం ట్యాక్స్‌ను ఎత్తివేయడం అనే రెండు అంశాలను ఆర్బీఐ గట్టిగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. డాలర్ డిపాజిట్ల స్కీమ్‌ను 2013లో చివరిసారిగా ఉపయోగించారు. తద్వారా అప్పట్లో అమెరికా వడ్డీరేట్లు సున్నాగా ఉన్న సమయంలో దాదాపు 26 బిలియన్ డాలర్లను సేకరించారు.
కాగా, గత ఏడాది విదేశీ మదుపర్లు భారతీయ బాండ్లలో సుమారు 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెట్టారు. కానీ ఈ ఏడాది ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఇప్పటిదాకా సుమారు 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనుకకుపోయాయి. ఇరాన్ యుద్ధం ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. స్టాక్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న పెట్టుబడులు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 20.6 బిలియన్ డాలర్లు వెనుకకుపోయాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎత్తివేత మదుపర్లలో మళ్లీ కొత్త జోష్‌ను నింపవచ్చని ఆర్బీఐ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో కరెన్సీ ఆస్తులు పడిపోతుండటం కలవరపెడుతున్నది. బంగారం నిల్వలు పెరుగుతున్నప్పటికీ విస్తృత ప్రయోజనాలుండే ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) క్షీణిస్తుండటం ప్రతికూలంగా మారుతున్నది. గత నెలాఖరుకల్లా ఇంచుమించుగా 550 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. కరెన్సీ మార్కెట్లో ఆకస్మిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఎఫ్సీఏనే అవసరం. అలాగే ముడి చమురు వంటి కీలక దిగుమతుల చెల్లింపులకు తక్షణమే ఉపయోగపడేది కూడా ఇవే. దేశ రుణ పరపతిని పెంచడమేగాక, మదుపర్లలో విశ్వాసాన్నీ ఇనుమడింపజేస్తుంది. అందుకే ఫారెక్స్ రిజర్వుల్లో ఎఫ్సీఏ వాటాను పెంచుకొనేందుకే ఆర్బీఐ ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. అయితే గల్ఫ్ ఉద్రిక్తతల నడుమ డాలర్ల డిమాండ్‌తో ఎఫ్సీఏ వేగంగా పడిపోతున్నదిప్పుడు. అయినప్పటికీ 11 నెలల దిగుమతులకు సరిపడా రిజర్వులున్నాయనే ఆర్బీఐ చెప్తున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింతగా దిగజారి జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. సోమవారం మరో 39 పైసలు నష్టపోయి తొలిసారి 95 మార్కుకు ఎగువన 95.23 వద్ద ముగిసింది. 94.95 వద్ద మొదలై అంతకంతకూ బలహీనపడింది. కాగా, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారత్‌లో ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనానికి దారితీయగలదన్న భయాలున్నాయి. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 110 డాలర్ల దగ్గర కదలాడుతున్నది. అంతకుముందు 126 డాలర్లకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరెన్సీ మార్కెట్లో ఈ గుబులు స్పష్టంగా కనిపిస్తున్నది. గడిచిన 2 వారాల్లో 2.32 పైసలు పతనం కావడం గమనార్హం.