ముంబై, మార్చి 17: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది మార్చి నాటికి 77.5 దరిదాపుల్లోకి పతనం కావచ్చన్న అంచనాలు వస్తున్నాయి. అధిక ఇంధన ధరల కారణంగా పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు (క్యాడ్), అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు.. రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయని క్రిసిల్ రేటింగ్స్ చెప్తున్నది. ఈ నెలాఖర్లోనే 76.5 వద్దకు రూపాయి విలువ పడిపోవచ్చన్న ఈ రేటింగ్ ఏజెన్సీ.. రాబోయే ఏడాది కాలంలో మరో రూపాయి మేర కోల్పోయే వీలుందని చెప్పింది. ‘ఇప్పటికే రూపాయి.. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ప్రభావితమవుతున్నది. ఈ క్రమంలోనే 2023 మార్చి నాటికి డాలర్‌తో చూస్తే 77.5 స్థాయికి మారకపు విలువ క్షీణించవచ్చు’ అని ఓ నివేదికలో గురువారం క్రిసిల్ రేటింగ్స్ పేర్కొన్నది. ‘రూపాయి బలహీనతలో రెండు ప్రధాన కారణాలు కీలకపాత్ర పోషించబోతున్నాయి. అవే.. ఎగబాకుతున్న ఇంధన ధరలతో పెరిగే కరెంట్ ఖాతా లోటు, ఇప్పుడే మొదలైన అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్ల పెంపులతో దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోయే విదేశీ పెట్టుబడులు’ అని విశ్లేషించింది.
చమురు సెగ
ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి మారకం విలువ పతనం.. ముడి చమురు దిగుమతుల్ని భారం చేయనున్నది. ఈ క్రమంలో బ్యారెల్ ధర 85-90 డాలర్లుగా ఉన్నా.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 2.4 శాతానికి పెరుగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) 1.6 శాతంగా నమోదు కావచ్చన్నది. గతంలో ఎన్నోసార్లు డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి తీవ్ర ఒత్తిడిలోకి జారుకున్న సందర్భాలున్నాయని, దీంతో క్యాడ్ కూడా పెరిగిందని క్రిసిల్ చెప్తున్నది.
ఆర్బీఐ జోక్యంతో..
ఫారెక్స్ మార్కెట్లలో ఒడిదుడుకుల నివారణ కోసం ఆర్బీఐ చేసుకునే జోక్యం.. రూపాయికి కలిసొస్తుందని క్రిసిల్ చెప్తున్నది. అయినా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించకపోతే రూపాయికి తిప్పలేనంటున్నది. ఆర్బీఐ జోక్యం స్వల్పకాలికంగానే లాభిస్తుందని, దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నది. అయితే దేశంలో ఫారెక్స్ నిల్వలు బాగున్నాయని, ఇది తప్పకుండా కలిసొచ్చే అంశమేనని స్పష్టం చేసింది.
విదేశీ పెట్టుబడులు వెనక్కి..
కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం కీలక వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్లని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. ఇటీవల 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మరో ఆరుసార్లు వడ్డింపులుంటాయన్న సంకేతాలనూ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ అధిక ఆదాయం కోసం భారతీయ మార్కెట్లకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఇక వెనక్కి వెళ్లిపోతాయని క్రిసిల్ చెప్తున్నది. భారత్‌సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలోనూ ఇంతే అంటున్నది. ఈ పరిణామం ఫారెక్స్ మార్కెట్లలో ఒక్కసారిగా డాలర్లకు డిమాండ్‌ను తెచ్చిపెడుతుందని, ఇదే జరిగితే స్థానిక కరెన్సీలకు దెబ్బేనని, రూపాయి నేలచూపులే చూస్తుందని క్రిసిల్ హెచ్చరిస్తున్నది. నిజానికి గతేడాది అక్టోబర్ నుంచే విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం గమనార్హం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ఏకంగా 13.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. గడిచిన దశాబ్దకాలంలోనే ఇది గరిష్ఠమని క్రిసిల్ తెలియజేసింది.