ముంబై, ఆగస్టు 30: దేశీయ స్టాక్ మార్కెట్లతోపాటు రూపాయి విలువ కూడా భారీగా పెరిగింది. సోమవారం రికార్డు స్థాయికి పడిపోయిన మారకం..ఆ మరుసటి రోజు రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 39 పైసలు పెరిగి 79.52 వద్ద నిలిచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, క్రూడాయిల్ తగ్గుముఖం పట్టడం రూపాయి భారీగా పెరగడానికి దోహదం చేశాయి. మరోవైపు, 20 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న డాలర్ విలువ పడిపోవడంతో ఇతర కరెన్సీలు పుంజుకున్నాయి. 79.92 వద్ద ప్రారంభమైన రుపీ-డాలర్ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 79.44 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 39 పైసలు లాభపడి 79.52 వద్ద నిలిచింది.