హైదరాబాద్: రూపాయి (Indian Rupee) మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్‌కు (US dollar) డిమాండ్ నెలకొనడంతో రూపాయి (Rupee Falls) లైఫ్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. ఇప్పటికే 90.15 స్థాయికి పడిపోయిన విలువ గురువారం మరో 28 పైసలు కోల్పోయి ఆల్‌టైం హైకి 90.43కి పడిపోయింది. రూపాయి విలువ పతనం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం రూ.90.70-91 మార్కును తాకుతుందని పేర్కొన్నారు.
కాగా, బుధవారం ఉదయం 89.96 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 90.30 స్థాయికి పతనమైంది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 19 పైసలు తగ్గి 90.15కి జారుకున్నది. మంగళవారం రూపాయి విలువ 43 పైసలు కోల్పోయి 89.96కి పడిపోయిన విషయం తెలిసిందే. దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ నెలకొనడం రూపాయి పతనానికి ఆజ్యంపోసిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 శాతం పతనం చెందింది.
అంతర్జాతీయంగా అన్ని కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు గురవుతున్నాయని, ఇదే క్రమంలో రూపాయి పతనం చెందింది తప్పా.. బలహీనమైన కరెన్సీ మాత్రం కాదని ఎస్బీఐ ఎకానమిక్ రీసర్చ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈవారంలోనే వడ్డీరేట్ల తగ్గింపుపై రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోనుండటం కూడా రూపాయి పతనానికి బ్రేక్ వేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. స్వల్పకాలంలో డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 89.90 నుంచి 91.20 మధ్యలో నమోదుకానున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,206 కోట్ల షేర్లను విక్రయించడం కూడా రూపాయి పతనానికి ఆజ్యంపోసింది. దేశీయ ఎగుమతులు నీరసించడం, వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన నెలకొనడం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనన నెలకొన్నది.
రూపాయి పతనంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. చమురు బిల్లుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావచ్చునని అంటున్నారు. ముఖ్యంగా దేశీయ వినిమయంలో 80 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ఇది పెద్దదెబ్బేనని వారు అంటున్నారు.
రోజురోజుకూ దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ (Rupee Slumps) కంటికి కనిపించని దెబ్బ కొడుతున్నది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం రూ.90 దాటింది. రూపాయి విలువ బలహీనపడుతున్నకొద్దీ దిగుమతి సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా, ఎగుమతి అయ్యే వస్తువులు చౌకగా మారిపోతున్నాయి. ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పతనమవుతున్న రూపాయి విలువతో ప్రధానంగా ప్రభావితమవుతున్నవారు విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు. ఇది వారి కుటుంబాలను కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతున్నది. రూపాయి విలువ తగ్గడం కారణంగా అమెరికా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తడిసి మోపెడవుతున్నది.
ఇటు రూపాయి పతనం అటు విద్యార్థుల వార్షిక ఫీజు, వారి జీవనంపై భారం మోపుతున్నది. ఫీజులు లక్షల్లో పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ మారకంలో తీసుకున్న విద్యా రుణాలు కూడా పెరిగిపోతున్నాయి. గత ఏడాది భారత్ నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్లిన వారి సంఖ్య 7.6 లక్షలు. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న సంజనా కుమార్ తన అనుభవాన్ని చెప్తూ..‘మా తల్లిదండ్రులు నాకు ఖర్చుల కోసం నెలకు 1500 డాలర్లు పంపుతారు. గత ఏడాది డాలర్ విలువ రూ.83.5 ఉన్నప్పుడు నా తల్లిదండ్రులకు రూ.1.25 లక్షలు ఖర్చయ్యేవి. ఇప్పుడు అవే 1500 డాలర్లకు వారికి మరో రూ.10 వేలు ఎక్కువగా ఖర్చవుతున్నాయి’ అని వివరించారు.