ముంబై, డిసెంబర్ 26: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. గత కొన్నిరోజులుగా పడుతూ వచ్చిన మారకం విలువ గురువారం మరో 12 పైసలు కోల్పోయి 85.27కి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతోపాటు డాలర్ బలోపేతం కావడం వల్లనే రూపాయి పై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు.
దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ నెలకొనడం, డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేసే అవకాశాలుండటం కూడా పతనాన్ని శాసించాయి. డాలర్‌తో పోలిస్తే 85.23 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఇంట్రాడేలో 85.28కి జారుకున్నది. చివరికి 12 పైసలు పతనం చెంది 85.27 వద్ద ముగిసింది. ఈవారంలో ఇప్పటి వరకు రూపాయి 13 పైసలు పతనం చెందింది. కనీస భవిష్యత్తులో డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు 85-85.45 స్థాయిలో కదలాడవచ్చునని ఫారెక్స్ డీలర్ తెలిపారు.
రూపాయి పతనంతో దిగుమతులకోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి రావచ్చునని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషివేటివ్(జీటీఆర్ఐ) వర్గాలు వెల్లడించాయి. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ఇప్పటి వరకు భారీగా పతనమైందని, దీంతో 15 బిలియన్ డాలర్ల అధికంగా నిధులు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే రూపాయి విలువ 2.34 శాతం పతనమైందని, దీంతో విలువ రూ.83.25 నుంచి రూ.85.20 స్థాయికి పడిపోయింది.
తీవ్ర ఒడిదొడుకుల మధ్య ట్రేడింగైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోవడంతో ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు స్వల్పంగా నష్టపోయి 78,472.48 వద్ద ముగియగా..నిఫ్టీ 22.55 పాయింట్లు ఎగబాకి 23,750.20 వద్ద ముగిసింది.