Indian Rupee | ముంబై, జూలై 6: కొద్ది రోజులపాటు కోలుకున్న రూపాయి తిరిగి వేగంగా పతనమవుతున్నది. గురువారం ముంబైలోని ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ భారీగా 35 పైసలు పతనమై 82.60 వద్ద ముగిసింది. ఒకే రోజులో ఇంతగా నష్టపోవడం ఐదు నెలల్లో ఇదే ప్రథమం. డాలర్ల మారకంలో రూపాయి విలువ వరుసగా మూడు రోజుల్లో 69 పైసల నష్టాన్ని చవిచూసింది. జూన్ 3న 81.91 స్థాయిలో ఉన్న కరెన్సీ 69 పైసలు క్షీణించి నెల రోజుల కనిష్ఠస్థాయి 82.60 వద్దకు పడిపోయింది.
వడ్డీ రేట్లను మరింత పెంచాల్సి ఉందని అమెరికా కేంద్ర బ్యాంక్ కమిటీ సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఫెడ్ మినిట్స్ వెల్లడించిన నేపథ్యంలో ఒక్కరోజులోనే తీవ్రంగా పతనమైందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఫెడ్ కఠినవైఖరితో యూఎస్ డాలర్ బలోపేతం అవుతున్నదని, మరోవైపు క్రూడ్ ధరలు పెరగడం కూడా రూపాయి క్షీణతకు దారితీసిందని వారు వివరించారు. సమీప భవిష్యత్తులో రూపాయి విలువ 82.80 స్థాయికి తగ్గవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ అంచనా వేశారు.